బీజేపీని టార్గెట్ చేస్తూ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. బీహార్ లో కులగణనపై బీజేపీ అవలంభిస్తున్న విధానంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
సుదీర్ఘమైన ప్రజాపోరాటాలు, ప్రజల నుంచి పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలోనే రాష్ట్రంలోని అన్ని పక్షాలు కులగణనకు అనుకూలంగా నిన్న సమావేశంలో నిర్ణయం తీసుకున్నాయంటూ ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు.
సామాజిక-ఆర్థిక, కుల గణన (ఎస్ఈసీసీ) 2011ను ప్రస్తావిస్తూ… బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నివేదికను బహిరంగపరచనందున ఆర్జేడీ కార్యకర్తలు ధర్నాలు, ప్రదర్శనలు నిర్వహించారని యాదవ్ చెప్పారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న భారతీయ కుటుంబాలను గుర్తించడానికి ఎస్ఈసీసీ-2011ను నిర్వహించారని తెలిపారు.
‘ కుల ఆధారిత జనాభా లెక్కల కోసం తీర్మానాన్ని అసెంబ్లీ రెండుసార్లు ఆమోదించింది. దీనిపై ప్రజాప్రతినిధుల బృందం కూడా ప్రధానిని కలిసింది. అన్ని పార్టీలకు లేఖలు రాశాయి. అయినా కులగణనకు బీజేపీ తిరస్కరించింది’ అని ట్వీట్ చేశారు.
‘ఈ నేపథ్యంలో బీజేపీకి, రాష్ట్ర ప్రభుత్వానికి మేము అల్టిమేటం ఇచ్చాము. కుల గణనకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించాము. ఈ నేపథ్యంలో బీజేపీ దిగివచ్చింది’ అని అన్నారు.