స్టార్ హీరోల సినిమాలు ఔట్ డోర్ లో షూట్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అందుకే పెద్ద హీరోలు మ్యాగ్జిమమ్ సెట్స్ లోనే పని కానిచ్చేస్తుంటారు. ఎంతటి పెద్ద షెడ్యూల్ అయినా సెట్స్ వైపే మొగ్గు చూపుతారు. ఈ క్రమంలో బీచ్ సెట్ లు కూడా వేయడం మొదలుపెట్టారు. తాజాగా సర్కారువారి పాట సినిమాకు ఇదే జరిగింది.
సర్కారువారిపాట ట్రయిలర్ తాజాగా రిలీజైంది. అందులో మహేష్ విశాఖ ఆర్కే బీచ్ లో ఫైట్ చేస్తాడు. విలన్ ను కొడితే పడవలోని చేపలు గాల్లోకి ఎగురుతాయి. అదే బీచ్ లో విలన్ కు మహేష్ వార్నింగ్ కూడా ఇస్తాడు. మరి ఈ సీన్లు అన్నీ ఆర్కే బీచ్ లో ఎప్పుడు తీశారు? ఆ టైమ్ లో ప్రజల్ని అదుపు చేయడం ఎలా సాధ్యమైంది?
అలాంటిదేం లేదంటున్నాడు మహేష్. ఆ ఎపిసోడ్ మొత్తాన్ని రామోజీ ఫిలింసిటీలో తీసినట్టు వెల్లడించాడు. అచ్చం వైజాగ్ ఆర్కే బీచ్ ను పోలిన సెట్ ను రామోజీ ఫిలింసిటీలో వేశారట. కొంత సెట్, ఇంకాస్త బ్లూ మ్యాట్ జోడించి.. అత్యంత సహజంగా కనిపించేలా బీచ్ ను రూపొందించారు. ఆ సన్నివేశాలన్నీ చాలా బాగా వచ్చాయంటున్నాడు మహేష్.
మహేష్-కీర్తిసురేష్ జంటగా నటించిన ఈ సినిమా ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి రానుంది. పరశురామ్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించాడు.