పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించిన చేసిన ప్రసంగాన్ని ప్రతిపక్షాలకు చెందిన 18 పార్టీలు బహిష్కరించడం చర్చనీయాంశంగా మారింది. సాగు చట్టాలకు వ్యతిరేకంగానే ఆయా పార్టీలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించాయి కూడా. అయితే సభకు హాజరైన పార్టీల్లో కూడా ఎంపీ.. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకంగా నిరసన గళం వినిపించి అందరి దృష్టిని ఆకర్షించారు.
గతంలో బీజేపీకి మిత్రపక్షంగా వ్యవహరించి.. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ సభ్యుడు ఈ పని చేశారు. ఆ పార్టీ ఎంపీ హనుమాన్ బెనివాల్ రాష్ట్రపతి ప్రసంగం చేస్తున్న సమయంలో గట్టిగా నినాదాలు చేశారు. మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు కూడా ప్రదర్శించారు. రాష్ట్రపతి ప్రసంగం అనంతరం.. హనుమాన్ బెనివాల్ సభలో ఆందోళనకు దిగిన ఫోటోలు మీడియాలో చక్కర్లు కొట్టాయి.