చదివింది మాత్రం పదో తరగతి.. కానీ జనరల్ ఫిజీషియన్ గా చలామణి అవుతున్న నకిలీ డాక్టర్ కథ గుట్టు రట్టు అయ్యింది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో అమాయకుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడు ఆర్ఎంపీ డాక్టర్. ప్రథమ చికిత్స కేంద్రాన్ని పాతరేసి.. కార్పొరేట్ ఆసుపత్రిగా మార్చి హంగులు ఆర్భాటాలు చేశాడు. ముందు ఆర్ఎంపీగా అవతారం ఎత్తి.. ఆ తర్వాత జనరల్ చికిత్స కేంద్రంగా మార్చేశాడు. మళ్లీ తెర వెనుక మంత్ర తంత్రాలు, భూత, తాయత్తుల వైద్యము పేరుతో భూత వైద్యునిగా మరో అవతారం కూడా ఎత్తాడు.
పదవతరగతి చదివి క్లీనిక్ బోర్డ్ పెట్టి.. పేద ప్రజల వద్ద నిలువు దోపిడీ చేస్తూ వచ్చాడు. బినామీ పేరుతో మందుల షాపు పక్కనే రోగ నిర్ధారణ రక్త పరీక్షల కేంద్రం కూడా ఏర్పాటు చేశాడు. అర్హతకు మించి పట్టభద్ర వైద్యులను మించిన వైద్యం చేస్తూ ప్రజలను మోసం చేసుకుంటూ వచ్చాడు. అమాయకుల పరిస్థితి ఆసరాగా చేసుకుని వైద్యం చేస్తూ ఏజెన్సీలోని ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడాడు.
కొత్తగూడ మండల కేంద్రంలో విజయ క్లీనిక్ అని బోర్డు పెట్టుకొని 24 గంటల మెడికల్ షాపు, జనరల్ ఫిజిషన్ అంటూ డాక్టర్ శ్యామ్ సుందర్ అవతారాలు ఎత్తాడు. డబ్బులు ఎర వేసి రకరకాల అక్రమ సర్టిఫికెట్లు పొందారనే విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
ఇష్టారీతిన రోగ నిర్ధారణ పరీక్షలు, అధిక ధరలకు మందులు అమ్మకాలు జరుపుతూ.. నిలువు దోపిడీ చేస్తున్న ప్రభుద్దుడి తీరు బయట పడటంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతా జరుగుతున్నా జిల్లా వైద్యాధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదంటూ పలువురు ఆరోపిస్తున్నారు.