తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం మడికి జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, ఓ చిన్నారి సహా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
రాజమహేంద్రవరం: ఆలమూరు దగ్గర జరిగిన రహదారి ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మామిడూరు గ్రామానికి చెందిన చరుమూరి రామస్వామి (65), సూర్య పార్వతి (50), సురేష్ (35), సునీత (30), కారుణ్య (5), రమ్య (28) ఈ కారులో ప్రయాణిస్తున్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు.
మారుతి జెన్ కారులో పెద్దాపురంలో జరిగిన ఒక శుభకార్యంలో పాల్గొని రావులపాలెం వైపు వస్తుండగా మడికి పెట్రోల్ బంక్ సమీపంలో ఆగి ఉన్న లారీ వీరి కారును ఢీకొంది. దాంతో తండ్రి కారులోనే మృతి చెందగా, డ్రైవింగ్ చేస్తున్న అతని కుమారుడు, కోడలు, భార్యతో పాటు మరో చిన్నారి, అతని సోదరుని కుమార్తెలకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న హైవే పెట్రోలింగ్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ వారిని హైవే అంబులెన్సులో రాజమండ్రి తరలించారు.