రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. తూర్పు కాన్పూరులోని టాట్ మిల్ క్రాస్‌రోడ్డు సమీపంలో ఎలక్ట్రిక్ బస్సు అదుపుతప్పిన ప్రయాణికులను ఢీ కొట్టింది.
దీంతో ఐదుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలు అయ్యాయి. బస్సు ఢీ కొట్టడంతో మూడు కార్లు, కొన్ని బైక్‌లు, బస్సు ధ్వంసమయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే బస్సును వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మృతదేహాలను, గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. బస్సు డ్రైవరు కోసం వెతుకుతున్నామని తూర్పు కాన్పూర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రమోద్ కుమార్ తెలిపారు.
మృతుల కుటుంబాలకు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ సంతాపం తెలిపారు. ‘‘కాన్పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను’’ అని ప్రియాంకగాంధీ ట్వీట్ చేశారు.