పద్మశ్రీ అవార్డు గ్రహిత వనజీవి రామయ్య రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఖమ్మం గ్రామీణ మండలం రెడ్డి గూడెంలోని తన ఇంటి నుంచి పల్లెగూడెంలో మొక్కలకు నీళ్లు పోసేందుకు బుధవారం తెల్లవారు జామున బైక్‌పై బయలుదేరారు. ఈ క్రమంలోనే రోడ్డు దాటుతుండగా రామయ్య ప్రయాణిస్తున్న బైక్ ను మరో బైక్ వచ్చి ఢీకొట్టింది. దీంతో ఆయన తలకు, కాలుకు తీవ్ర గాయాలయ్యాయి.
గమనించిన స్థానికులు.. ఆయనను ఖమ్మం ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న రామయ్య కుటుంబ సభ్యులు.. ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రస్తుతం రామయ్య ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆసుపత్రి సూపరిండెంట్ బి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న ఎంపీ సంతోష్‌కుమార్.. రామయ్య ఆరోగ్యంపై ఆరా తీశారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
ఖమ్మం జిల్లాలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన రామయ్యకు చిన్న తనం నుండే మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం. అంతేకాకుండా.. సుమారు 120 రకాల మొక్కల చరిత్రను అలవోకగా చెప్తారు. మొక్కల పెంపకం కోసం చేస్తున్న కృషికి గానూ 2017లో పద్మశ్రీ అవార్డును ఇచ్చింది కేంద్రం. రామయ్య జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చింది రాష్ట్ర ప్రభుత్వం.
మొక్కల పెంపకంపై రామయ్య ప్రజల్లో తిరిగి అవగాహన కల్పిస్తుంటారు. దీంతో ఆయనను వనజీవి రామయ్యగా పిలుస్తుంటారు. వేసవి కాలంలో అటవీ ప్రాంతంలో తిరిగి రకరకాల గింజలు సేకరించి వర్షాకాలంలో రోడ్ల వెంట, ఖాళీ ప్రదేశాల్లో నాటుతారు. తొలుత తన ఇంట్లో మొక్కలను పెంచిన రామయ్య.. ఆ తర్వాత ఎక్కడ ఖాళీ స్థలం కన్సిస్తే అక్కడ మొక్కలు పెంచుతూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.