– వికారాబాద్ జిల్లాలో రెచ్చిపోతున్న రియల్టర్లు
– ప్రభుత్వ రోడ్డు తవ్వేసి కబ్జా
– అండగా స్థానిక లీడర్లు
– పట్టించుకోని అధికారులు
– సరైన అనుమతులు లేకుండానే వెంచర్
రాష్ట్రంలో కొందరు రియల్టర్లకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. స్థానిక లీడర్లను, అధికారులను మేనేజ్ చేస్తూ విచ్చలవిడిగా కబ్జాలకు పాల్పడుతున్నారు. తాజాగా వికారాబాద్ జిల్లాలో మరీ బరి తెగించారు. ఏకంగా ప్రభుత్వ బీటీ రోడ్డునే లేపేశారు. ఎకరం వరకు కబ్జా చేశారు. ఇంత జరుగుతున్నా.. అధికారులు అటుదిక్కు చూడడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
పరిగి మండలం నారాయణ పూర్ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 233, 234 లో దాదాపు 12 ఎకరాల భూమిని హైదరాబాద్ కు చెందిన కొందరు రియల్టర్లు కొనుగోలు చేశారు. ఈ రెండు సర్వే నెంబర్ల మధ్య నుండి సుల్తాన్ పూర్- దోమ తారు రోడ్డు నుండి నారాయణ పూర్ గ్రామానికి రోడ్డు ఉంది. ఈ రహదారి గుండానే నిత్యం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. అయితే.. రోడ్డుకు పక్కనే ఉన్న 233, 234 సర్వే నెంబర్లలో భూమి కోనుగోలు చేసిన రియల్టర్లు యథేచ్ఛగా కబ్జాకు తెగబడ్డారు. మొదట వారు కోనుగోలు చేసిన భూమికి ప్రహారీ గోడ నిర్మించారు. తర్వాత వీరి కన్ను ప్రభుత్వ రోడ్డుపై పడి వెంచర్ మధ్యలో ఉన్న దాదాపు 500 మీటర్ల మెటల్ రోడ్డును జేసీబీలతో తవ్వేసి రాత్రికి రాత్రి రోడ్డును మాయం చేశారని ఆయా గ్రామాల ప్రజలు చెబుతున్నారు. దాదాపు ఎకరాకు పైగా భూమి కబ్జాకు గురైనట్టు వివరిస్తున్నారు. అంతేకాదు, మెటల్ రోడ్డు పక్కనే ఉన్న మిషన్ భగీరథ పైప్ లైన్ ను తవ్వేసి వెంచర్ లో వేసిన రోడ్డు పక్కకు మార్చేశారని చెబుతున్నారు.
పరిగి-దోమ తారు రోడ్డు నుంచి నారాయణపూర్ వరకు రోడ్డును 30ఏళ్ల క్రితం వేశారు. మండల పరిషత్, జెడ్పీ నిధుల నుంచి మట్టి, కంకర రోడ్డును వేశారు. 1998లో ప్రధానమంత్రి గ్రామీణ్ సడక్ యోజన కింద దీనికి అనుమతి ఉంది. రోడ్డుకు ఇరువైపులా గ్రావెలింగ్ కూడా పూర్తి చేశారు. దశాబ్దాలుగా వాడుకలో ఉన్న ఈ రోడ్డును ప్రస్తుతం రియల్టర్లు పూడ్చి వేశారని అంటున్నారు గ్రామస్తులు. రోడ్డును తవ్వేస్తున్నారని పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లినా వారేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
కబ్జా వ్యవహారం ఇలా ఉంటే వీరు కొనసాగిస్తున్న వెంచర్ కు ఎలాంటి అనుమతులు లేవని అంటున్నారు గ్రామస్తులు. కనీసం వ్యవసాయేతర భూమిగా కూడా మార్చకుండానే డీటీసీపీ దరఖాస్తు కూడా లేకుండానే రోడ్లు, విద్యుత్ స్తంభాల ఏర్పాట్లు చేశారని చెబుతున్నారు. సంబంధిత అధికారులు, కొందరు ప్రజాప్రతినిధులకు భారీ మొత్తంలో ముట్టజెప్పి పనులను దర్జాగా చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. గ్రామంలోనే ఉంటున్న పంచాయతీ కార్యదర్శి సైతం పనులను అడ్డుకోవడం గానీ, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం గానీ చేయడం లేదంటున్నారు. రోడ్డు తవ్వేసి మరీ.. ఏర్పాటు చేస్తున్న వెంచర్ నిర్వాహకులపై వెంటనే కలెక్టర్ చర్యలు తీసుకోవాలని నారాయణ పూర్, పరిసర గ్రామాల ప్రజలు కోరుతున్నారు.