బెంగుళూరులో మరో షాకింగ్ ఘటన.. ఇటీవలే ఓ వృద్దుడిని బైక్ పై యువకుడు ఈడ్చుకెళ్ళిన ఉదంతం మరవక ముందే శుక్రవారం అదే తరహా ఘటన జరిగింది. తనను దుర్భాషలాడాడన్న కోపంతో ఓ యువతి తన కారు బానెట్ పై అతడిని సుమారు కిలోమీటర్ దూరం ఈడ్చుకువెళ్లింది. ఆమెను ప్రియాంక గా గుర్తించారు.
పోలీసుల కథనం ప్రకారం.. ఈమె కారులో వెళ్తూ..దర్శన్ అనే వ్యక్తి కారును ఢీ కొట్టింది. దీంతో ఆయన.. తన కారు దిగి ఆమెతో వాగ్యుద్దానికి దిగాడు. ఇద్దరి మధ్యా మాటామాటా పెరిగింది. దర్శన్ కోపంగా మాట్లాడుతుండగానే ప్రియాంక తన కారును ముందుకు దూకించింది. అయితే దర్శన్ అడ్డుకునేందుకు హఠాత్తుగా ఆమె వాహనం బానెట్ పైకి దూకాడు.
అయినా ప్రియాంక తన కారు ఆపకుండా అలాగే అతడిని కి.మీ. దూరం వరకు లాక్కువెళ్ళింది. ఒక చోట ప్రియాంక కారు ఆపగానే దర్శన్, అతడి స్నేహితులు ఆమె వాహనంపై దాడికి పాల్పడ్డారు.
అనంతరం ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేయగా ప్రియాంకతో సహా దర్శన్, అతని స్నేహితులు నలుగురిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. ప్రియాంక కారు బానెట్ పై దర్శన్ వేలాడుతుండగా ఆమె అలాగే వేగంగా తన వాహనాన్ని నడుపుతున్న వైనాన్ని వెనుకే ద్విచక్ర వాహనాలపై వస్తున్న కొందరు వీడియో తీశారు.