వ్యవసాయ రంగానికి 24 గంటలు ఉచిత విద్యుత్ అంశం ఇటు అసెంబ్లీని షేక్ చేస్తుంటే..అటు రైతులు ధర్నాకు దిగారు. కన్నెపల్లి మండల కేంద్రంలోని కేవీ విద్యుత్ ఉపకేంద్రం ప్రధాన రహదారి పై గురువారం రైతులు ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి నిరసనగా నినాదాలు చేశారు.
బెల్లంపల్లి, దహేగం మండలం వెళ్లే రహదారిపై రెండు గంటల పాటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల కోసం 24 గంటల ఉచిత విద్యుత్ ఉత్తదేనని మండిపడ్డారు. మండల కేంద్రానికి కరెంట్ అసలు ఇవ్వడం లేదని, ఉదయం నుంచి సాయంత్రం వరకు కనీసం రెండు మూడు గంటల కరెంటు సరఫరా కూడా ఇవ్వడం లేదన్నారు.
యాసంగి వరి సాగు, కూరగాయల పంటలకు నీరు లేక ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను ప్రభుత్వం హామీలతోనే సరిపెడుతోందని, కనీసం బెల్లంపల్లిలో ఉన్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కూడా తమ బాధలు పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపించారు. విద్యుత్ అధికారులు వచ్చేంత వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదంటూ రైతులు భీష్మించుకు కూర్చున్నారు.
ఆయా మండలాల నుంచి మంచిర్యాల జిల్లా ఆస్పత్రులకు వెళ్లడానికి ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. పెళ్లి శుభకార్యాల కోసం వెళ్లేవారు సైతం అక్కడే ఉండియారు. ఎంత నచ్చచెప్పినా వినకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గంట తర్వాత విద్యుత్ ఏఈ రావడంతో మండల కేంద్రానికి అసలు విద్యుత్ సరఫరా ఇవ్వడం లేదని రైతులు నిలదీశారు. అనంతరం ఫోన్ ద్వారా ఏడీ రాంచందర్ కు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న ఏడీ తో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడారు.
దీంతో కొంత సేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కరెంటు ఇస్తానని మాట ఇస్తేనే ఇక్కడి నుంచి కదలమని చెప్పడంతో స్పందించిన విద్యుత్ ఏడీ రైతులను రిప్రజెంటేషన్ ఇవ్వాలని కోరారు. పై స్థాయి అధికారులకు చెప్పి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.