అగ్నిపథ్ పై పలు రాష్ట్రాలు అట్టుడికిపోతున్నాయి. బిహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానాల్లో ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. బిహార్ లో సమస్తిపూర్, లఖిసరాయ్ ప్రాంతాల్లో పలు రైళ్లకు అందోళనకారులు నిప్పంటించారు.
యూపీలో కాన్పూర్- ఝాన్సీ జాతీయ రహదారిని నిరసనకారులు దిగ్బంధం చేశారు. అలీఘర్ లోని తప్పాల్ ప్రాంతంలో పలు బస్సులను నిరసనకారులు దగ్ధం చేశారు. పలు ప్రాంతాల్లో రైళ్లపై ఆందోళనకారులు రాళ్ల దాడి చేశారు.
ఈ ఘటనకు సంబంధించి బాలియా జిల్లాలో సుమారు వంద మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ ఆగ్రా జాతీయ రహదారిపై పోలీసులపై నిరసన కారులు రాళ్లు రువ్వారు. దీంతో వారిపై పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు.
బిహార్ లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సంజయ్ జైశ్వాల్ ఇంటిపై ఆందోళనకారులు దాడి చేశారు. దీంతో ఆయన నివాసం వద్ద బారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఆందోళనల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పలు రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది.