తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న వరుస సంఘటనలతో భక్తుల్లో ఆందోళన నెలకొంది. మొన్న “వకులా మాత” ఆలయంలో చోరీకి యత్నం, ఈ మధ్య “డ్రోన్” కెమెరాతో తిరుమల శ్రీవారి ఆలయంపై షూట్ చేయడం, సోమవారం శ్రీవారి ఆలయానికి కూతవేటు దూరంలో ఉన్న లడ్డు కౌంటర్ లో చోరీ.. వీటన్నింటికీ టీటీడీ వైఫల్యామే కారణమని అంటున్నారు భక్తులు. తిరుమల శ్రీవారి దర్శనానంతరం భక్తులు పరమ పవిత్రంగా భావించేది లడ్డూ ప్రసాదం. ఆ లడ్డూ కోసం భక్తులు గంటల తరబడి వేచి ఉంటారు.
శ్రీవారి భక్తులకు సకాలంలో లడ్డు అందించే విధంగా కనీసం 50 కౌంటర్లను తెరిచి, దానికి తగ్గట్టుగా సిబ్బందిని ఏర్పాటు చేసుకొని వారికి రిలీవర్ గా మరొకరిని నియమించి ఉంటే లడ్డు కౌంటర్ లో రూ. 2 లక్షల దొంగతనం జరిగే అవకాశం ఉండేది కాదంటున్నాడు ఓ భక్తులు. తిరుమల లడ్డూ కౌంటర్లలో సీసీ కెమెరాలు ఉన్నాయి.. విజిలెన్స్ సిబ్బంది ఉంటారు.. అలాంటి చోట దొంగతనం జరగడం విజిలెన్స్ అధికారుల భద్రత పై సవాల్ విసరడమే అంటున్నారు. టీటీడీ ఉన్నతాధికారులు, విజిలెన్స్ అధికారులు, ధర్మకర్తల మండలి ఇలాంటి సంఘటనలు పునరావడం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని స్థానిక భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
కాగా ఇటీవల టీటీడీ అధికారులు “శ్రీలక్ష్మీ శ్రీనివాస మెన్ పవర్ కార్పొరేషన్” ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు జరిపి సిబ్బందిని నియమించారు. అయితే లడ్డు కౌంటర్లలో నియమించిన సిబ్బందికి “రిలీవర్” లేకపోవడంతో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని అంటున్నారు. లడ్డు కౌంటర్లలో పనిచేస్తున్న సిబ్బందికి వీక్లీ ఆఫ్ ఇవ్వాలని, అలాగే లడ్డూ తయారీ పోటు నుంచి కౌంటర్ కి లడ్డు ట్రేలు చేరాక కొన్ని సందర్భాలలో లడ్లు షార్టేజ్ రావడంతో కౌంటర్ సిబ్బంది జేబు నుంచి చెల్లించాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు. దీనిపై విజిలెన్స్ అధికారులు దృష్టి సారించాలన్నారు.
తిరుమలలో లడ్డు కౌంటర్లను గత 30 సంవత్సరాలుగా వివిధ బ్యాంకర్స్ ఆధ్వర్యంలో సిబ్బందిని ఏర్పాటు చేసుకుని, వారే జీతాలు చెల్లించేవారు. టీటీడీపై ఆర్థిక భారం లేకుండా ఉండేది. అలాంటి సమయంలో కూడా చిన్న చిన్న పొరపాటులే.. తప్ప దొంగతనాలు జరిగిన సందర్భాలు లేవు. తిరుమలలో లడ్డు కౌంటర్లను జాతీయ బ్యాంకర్ల నుంచి తప్పించి “KVM” అనే ఒక బెంగుళూరు సంస్థకు అప్పజెప్పడం సమంజసం కాదని.. శ్రీవారి భక్తునిగా మొరపెట్టుకున్నా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని నాపై కేసు పెట్టారు. KVM సంస్థకు టెండర్ ను అప్పగించడం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆ తర్వాత “మూడు నాళ్ళ ముచ్చటే” అయ్యింది. తిరుమల లడ్డు కౌంటర్లలో నెలలు గడవకముందే KVM ఏజెన్సీ అవకతవకలకు పాల్పడిందని, టెండర్లు రద్దు చేస్తూ ఆ సంస్థను లడ్డు కౌంటర్ల నుంచి టీటీడీ అధికారులే తొలగించారన్నారు.