మృత్యువు బండ రాయి రూపంలో దూసుకు వచ్చింది. ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల పాలిట యమపాశమైంది. ఎనిమిది మంది ప్రాణాలను బలితీసుకుని విషాదాన్ని మిగిల్చింది. మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటనపై తీవ్ర చర్చ నడుస్తోంది.
నిబంధనల పట్ల నిర్లక్ష్యం, కొరవడిన అధికారుల తనిఖీలు కలగలిపి ఈ ప్రమాదానికి దారి తీశాయని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. నిబంధనల ప్రకారం గ్రానైట్ కంపెనీ నుంచి బయటకు పంపే ముందే రాయిని డ్రెస్సింగ్ చేయాల్సి వుండగా అలా చేయలేదని తెలిసిపోతోంది.
డ్రెస్సింగ్ చేసి వుంటే సున్నితంగా ఉండి లారీలో నుంచి రాయి జారిపడేందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయని చెబుతున్నారు. సాధారణంగా పన్నులు ఎగ వేసేందుకు ఎక్కువగా ఇలా చేస్తుంటారని అంటున్నారు. అయితే వీటిపై ప్రభుత్వ అధికారులు తనిఖీలు చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
తనిఖీలు లేకపోవడంతో గ్రానైట్ కంపెనీలు ఇష్టారాజ్యంగా బండరాళ్లను తరలిస్తున్నాయని, చివరకు ప్రమాదాలకు కారణాలవుతున్నాయని మండిపడుతున్నారు. గతంలో కూడా కొన్ని జిల్లాలో ఇలాంటి ఘటనలు జరిగాయని,అయినప్పటికీ అధికారులు ఇంకా కండ్లు తెరవడం లేదంటున్నారు.
అధికారుల నిర్లక్ష్యం వల్ల అటు ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడుతోందని, ఇటు ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా వరకు లారీల్లో ఓవర్ లోడ్ చేస్తున్నారని, ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలు, నిబంధనలు పాటించడం లేదని అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు తనిఖీలు నిర్వహించి అటు ప్రభుత్వ ఆదాయాన్ని, ఇటు ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరుతున్నారు.