రాకెట్ దాడితో పంజాబ్ ఉలిక్కి పడింది. పాక్ సరిహద్దుకు సమీపంలోని పోలీస్ స్టేషన్ పై రాకెట్ లాంఛర్ తరహా ఆయుధంతో దుండగులు దాడి చేశారు. తేలికపాటి రాకెట్ లాంఛర్ ను ఉపయోగించి ఉగ్రవాదులు దాడికి దిగినట్టు పోలీసులు వివరించారు.
అమృత్‌సర్-భటిండా జాతీయ రహదారి పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ పై తెల్లవారు జామున 1 గంటలకు దాడి జరిగిందని పోలీసులు వెల్లడించారు. దాడి నేపథ్యంలో పోలీస్ స్టేషన్ భవనానికి స్వల్ప నష్టం జరిగిందన్నారు. రాకెట్-లాంచర్ తరహాలో ఉన్న ఆయుధం మొదటగా ఓ స్తంభాన్ని ఢీకొట్టిందన్నారు. ఆ తర్వాత అది పోలీస్ స్టేషన్‌ను తాకిందన్నారు.
ఈ దాడిలో సిబ్బంది ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని పోలీసులు వివరించారు. ఈ దాడిని కలిస్తాన్ ఉగ్రవాదుల చర్యగా అనుమానిస్తున్నారు. పాకిస్థాన్ సరిహద్దుకు దగ్గర్లో ఉండటంతో ఐఎస్ఐ ఉగ్రవాదుల హస్తం ఉండి వుంటుందని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి.
పాక్‌లో ఇటీవల మరణించినట్లు భావిస్తున్న ఖలిస్తానీ ఉగ్రవాది హర్విందర్ సింగ్ రిండా స్వస్థలం సర్హాలి. రిండా మరణంపై ఇటీవల వార్తలు వస్తున్నాయి. కానీ దీన్ని పోలీసులు నిర్దారించలేదు. ఈ క్రమంలో రిండా ప్రాణాలతో ఉండాలని, రిండాకు హాని తలపెట్టొద్దనే హెచ్చరిక పంపేందుకే తాజా రాకెట్ దాడి జరిపినట్లు ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు.
కిడ్నీ ఫెయిల్యూర్ కావడంతో హర్విందర్ సింగ్ రిండా లాహోర్‌లోని ఆసుపత్రిలో చేరారని తెలుస్తోంది. అక్కడ అతను మరణించాడని రాష్ట్ర పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. కాగా, పోలీస్ స్టేషన్‌పై రాకెట్ దాడి నేపథ్యంలో పంజాబ్ పోలీసులు అప్రమత్తమయ్యారు.