చిత్ర సీమను పట్టిపీడించే అతి పెద్ద భూతం పైరసీ. దీనిని ఆరికట్టాలని చాలా కాలం నుంచి ఎందరో ప్రయత్నిస్తున్నప్పటికీ సాధ్యపడట్లేదనే చెప్పవచ్చు. సినిమా వచ్చిన సాయంత్రానికే చాలా సినిమాలు పైరసీ అయిపోతున్నాయి. ఈ సెగ ఒక్క టాలీవుడ్‌నే కాదు.. కోలీవుడ్, మాలీవుడ్.. వంటి వాటికి కూడా తగిలింది.
తాజాగా కోలీవుడ్ స్టార్ మాధవన్ నటించిన చిత్రం రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్. ఈ చిత్రం ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ బయోపిక్ ఆధారంగా తెరకెక్కింది. మాధవన్ ప్రధాన పాత్రలో నటించి దర్శకత్వం వహించిన ఈ సినిమా తీయడానికి దాదాపు 6 సంవత్సరాలు పట్టింది. జులై 1న విడుదలైన ఈ సినిమాకు విమర్శకుల నుంచి సైతం మంచి ప్రశంసలు లభించాయి.
మాధవన్ అభిమానులుకు అయితే ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి పండగే అని చెప్పవచ్చు. ఈ క్రమంలో ఓ నెటిజన్..’నిన్న రాకెట్రీ సినిమా చూశాను. చివరి సీన్ ఏదైతే ఉందో దాన్ని పదేపదే చూశాను. మీ తొలి దర్శకత్వమే అద్భుతంగా ఉంది. ఇక నటనకు కొంచెం కూడా వంక పెట్టాల్సిన పని లేదు’ అంటూ హీరో మాధవన్‌ను ట్యాగ్ చేశాడు.
దీంతో మాధవన్ ఈ ట్వీట్‌పై స్పందిస్తూ.. ‘నువ్వు ఒక్క సన్నివేశాన్నే పదే పదే ఎలా చూడగలిగావు?’ అని ప్రశ్నించాడు. దీంతో అడ్డంగా దొరికిపోయాననుకున్న నెటిజన్ వెంటనే తన ట్వీట్‌ను డిలీట్ చేశాడు.
కానీ అప్పటికే దానికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను ఇతర నెటిజన్లు నెట్టింట వైరల్ చేశారు. సినిమా వచ్చి కేవలం వారం రోజులు మాత్రమే అవుతోంది.
థియేటర్లలో విజయవంతంగా ఆడుతున్న ఈ చిత్రం ఇప్పుడప్పుడే ఓటీటీలోకి వచ్చే అవకాశాలు కూడా కనిపించడం లేదు. మరి అతడు నచ్చిన సన్నివేశాన్ని పదే పదే చూశాడంటే అది థియేటర్‌లో సాధ్యపడదు. అంటే అతడు పైరసీ ద్వారా సినిమా చూశాడని ఇట్టే తెలిసిపోతుంది. అతడికి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించేలా మ్యాడీ కౌంటర్ ఇవ్వడంతో నెటిజన్లు పడీపడీ నవ్వుతున్నారు.