బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండోర్ లోని హోల్కర్ మైదానంలో జరిగిన మూడో టెస్టులో ఎట్టకేలకు ఆస్ట్రేలియా ఓ విజయాన్ని అందుకుంది. మూడో రోజు స్వల్ప టార్గెట్ ను ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. 76 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. ట్రావిస్ హెడ్, మార్నస్ లాబుస్ చాగ్నే సంయమనంతో ఆస్ట్రేలియా జట్టు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మూడో టెస్టులో 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఈ విజయంతో నాలుగు మ్యాచ్ ల సిరీస్ లో కంగారూ జట్టు 2-1 తో పునరాగమనం చేసింది. సిరీస్ లోని చివరి మ్యాచ్ మార్చి 9 నుంచి 13 వరకు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. మూడో రోజు మ్యాచ్ లో కంగారూ జట్టు నాల్గో ఇన్నింగ్స్ లో 76 పరుగుల లక్ష్యాన్ని సులువుగా ఛేదించింది.
అయితే భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రెండో బంతికి ఉస్మాన్ ఖవాజాను పెవిలియన్ కు పింపి భారత్ అభిమానుల ఆశలు రేకెత్తించాడు. మొదటి 11 ఓవర్లలో భారత స్పిన్నర్లు కూడా సమర్థవంతంగా బౌలింగ్ చేశారు. కానీ, 12 వ ఓవర్లో బంతిని మార్చారు.
బంతి మారగానే పరిస్థితులు మారిపోయాయి. ట్రావిస్ హెడ్, మార్నస్ లాబుషెన్ అజేయంగా నిలిచి, విజయంతో తిరిగి వచ్చారు. అంతకు ముందు భారత్ రెండో ఇన్నింగ్స్ లో 163 పరుగులకు ఆలౌటైంది.