రోహిత్ శర్మ.. క్రికెట్ చరిత్రలో తనకో గుర్తింపును సాధించుకున్న భారత క్రికెటర్. క్రికెట్ అభిమానులు అంతా హిట్ మ్యాన్ గా పిలుచుకునే వ్యక్తి. తనదైన శైలితో ఆడుతూ ఎందరో అభిమానుల మనసులను సంపాధించుకోవడమే కాకుండా.. ఎన్నో రికార్డులను మూటగట్టుకున్నాడు. కానీ.. ఐపీఎల్ లో ఓ చెత్త రికార్డును కూడా నెలకొల్పాడు.
గురువారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ తొలి ఓవర్లోనే డకౌట్ అయ్యాడు. ఓవరాల్ ఐపీఎల్‌లో అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాడిగా నిలిచి ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో మొత్తం 14 సార్లు రోహిత్ డకౌట్ అయ్యాడు.
రోహిత్ తర్వాత అత్యధికంగా 13 సార్లు డకౌట్ అయిన ఆటగాళ్లలో పీయూష్ చావ్లా, హర్భజన్, మన్‌దీప్ సింగ్, పార్థివ్ పటేల్, రహానే, అంబటి రాయుడు ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఈ సీజన్ ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ వరుసగా ఏడో పరాజయాన్ని నమోదు చేసింది. దీంతో దాదాపుగా ప్లే ఆఫ్స్ అవకాశాలను ముంబై జట్టు దూరం చేసుకుంది.
ఈ ఏడాది అటు కెప్టెన్ గా, ఇటు ఆటగాడిగా రోహిత్ దారుణ వైఫల్యాలను చవిచూస్తున్నాడు. గతంలో ఐదు టైటిల్స్ అందించిన కెప్టెన్ ఇతడేనా అంటూ విమర్శలను ఎదుర్కొంటున్నాడు. ఈ సీజన్ లో రోహిత్ ఆడిన ఏడు మ్యాచ్ లలో కేవలం 114 పరుగులు మాత్రమే చేయడం గమనార్హం. ఈ ఏడాది ఐపీఎల్‌లో అతను ఆడిన ఏడు మ్యాచ్ ల్లో 41, 10, 3, 26, 8, 6, 0 గా రోహిత్ స్కోర్ చేశాడు.