ఐపీఎల్లో ఐదుసార్లు టైటిల్ గెలుచుకున్న ముంబై ఇండియన్స్ టీం ఈ సీజన్లో పేలవ ప్రదర్శనను కొనసాగిస్తోంది. ఇప్పటికే ప్లే ఆఫ్ రేస్ నుంచి నిష్క్రమించింది. అయితే, శుక్రవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండో విజయాన్ని నమోదు చేసింది. ఉత్కంఠగా సాగిని పోరులో చివరికి ముంబైనే విజయం వరించింది. అంతేకాదు కెప్లెన్ రోహిత్ శర్మ బ్యాట్‌తో విరుచుకుపడి కొత్త రికార్డును నమోదు చేశాడు.
ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో శుక్రవారం ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడ్డాయి. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై టీం 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్(45), రోహిత్ శర్మ(43) తొలి వికెట్‌కి 74 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పినా.. మిడిలార్డర్ తడబడటంతో ఆ జట్టు తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించింది. కానీ, ఆఖర్లో టిమ్ డేవిడ్(44) దూకుడుగా ఆడటంతో.. ముంబై గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది.
178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ ఇన్నింగ్స్.. ముంబై ఆటకు రీప్లేలా సాగింది. వీరి కూడా అదిరిపోయే ఆరంభం లభించింది. కానీ, 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా(55), శుభ్ మన్ గిల్(52) హాఫ్ సెంచరీలతో రాణించారు. హార్ధిక్ పాండ్యా (24), సాయి సుదర్శన్ (14), రాహుల్ తెవాటియా (3) పరుగులు చేశారు.
ఇక, ఈ మ్యాచ్‌లో తన ట్రేడ్ మార్క్ అయిన ఫుల్ షాట్‌తో మొదటి సిక్స్ బాదాడు రోహిత్ శర్మ. అల్జారీ జోసెఫ్ వేసిన బంతిని సిక్సర్‌గా మలిచిన రోహిత్.. మిడ్ వికెట్ మీదుగా కళ్లుచెదిరే రీతిలో సిక్సర్ బాది ఐపీఎల్లో ముంబై తరపున 200 సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలిచాడు. ఈ సిక్స్‌తో రోహిత్ ఐపీఎల్లో ఒక ఫ్రాంచైజీ కోసం అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్ల లిస్టులో చేరాడు. కీరన్ పొలార్డ్ తర్వాత ముంబై జట్టు తరపున 200 సిక్సర్లు బాదిన రెండో ముంబై ప్లేయర్‌గా రోహిత్ నిలిచాడు. కీరన్ పొలార్డ్ ముంబై తరపున 257సిక్సర్లను బాదాడు.
అలాగే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున క్రిస్ గేల్ 263 సిక్సర్లతో అత్యధికంగా ఓ ఫ్రాంఛైజీ తరపున సిక్సర్లు బాదిన ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. పొలార్డ్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. ఏబీ డివిలియర్స్(240 సిక్సర్లు), విరాట్ కోహ్లీ(228 సిక్సర్లు) ఈ జాబితాలో మూడు, నాలుగో స్థానంలో ఉన్నారు. గేల్, కోహ్లీ, డివిలియర్స్ ముగ్గురు కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపునే ఈ ఫీట్ అందుకున్నారు. 5వ స్థానంలో రోహిత్ శర్మ (200 సిక్సర్లు) ఉన్నాడు.