బాలీవుడ్ స్టార్ దర్శకుడు రోహిత్ శెట్టి ప్రమాదానికి గురయ్యారు. ఓ వెబ్ సిరీస్ షూటింగ్ నిమిత్తం ఆయన హైదరాబాద్ వచ్చారు. వెబ్ సిరీస్ షూటింగ్‌లో కారు ఛేజింగ్ సీన్ చిత్రీకరిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆయన చేతికి బాగా గాయాలైనట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలో ఆయన్ని కామినేని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు చిన్న సర్జరీ చేసినట్టు సినీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ అనే యాక్షన్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్‌ను ఆయన తెరకెక్కిస్తున్నారు. ఇందులో కథానాయకుడిగా సిద్ధార్థ్ మల్హోత్ర నటిస్తున్నారు.
కబీర్ మాలిక్ అనే ఓ పవర్ ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో సిద్ధార్థ్ నటిస్తున్నారు. ఈ వెబ్‌సిరీస్ షూటింగ్ సమయంలో కారు ఛేజింగ్ సీన్‌ను తీస్తున్న సమయంలోనే రోహిత్ గాయపడ్డారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ వీడియో, రోహిత్ శెట్టిలు సంయుక్తంగా ఈ వెబ్ సిరీస్‌ను నిర్మిస్తున్నాయి.
దేశంలో నిజాయితీతో నిస్వార్థంగా పనిచేస్తున్న పోలీసుల ధైర్య సాహసాలను ఆధారం చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు నిర్మాణ సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. మొత్తం ఎనిమిది ఎపిసోడ్లుగా ఈ వెబ్ సిరీస్ రాబోతోంది. ఈ సిరీస్ నేరుగా అమెజాన్ ప్రైమ్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.