భీమ్లానాయక్ మూవీ రిలీజ్ సమయంలో చోటు చేసుకున్న పరిణామాలు ఏపీలో ఇప్పుడు రాజకీయ వివాదంగా మారాయి. జనసేన అధినేత పవన్ లక్ష్యంగా సినీ పరిశ్రమను ఏపీ ప్రభుత్వం వేధిస్తోందంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
పవన్ నటించిన భీమ్లానాయక్ కు తెలంగాణలో అయిదో షో కు అనుమతి ఇచ్చారు. ఏపీలో మాత్రం పాత నిర్ణయాలనే అమలు చేస్తున్నారు. సీఎం జగన్ తో చిరంజీవి టీం సమావేశమైన సమయంలో అన్ని సమస్యలు పరిష్కారం అయినాయని చెప్పినా.. జీవో విడుదల చేయకపోవటంతో టికెట్ ధరలు పెరగలేదు.
ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం పైన వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా స్పందించారు. పవన్ కళ్యాణ్ ను తొక్కేయాలని మేమెందుకు చూస్తాం.. అయినా ఆయన ప్రొడ్యూసరా.. లేక డిస్ట్రిబ్యూటరా..అంటూ ప్రశ్నించారు. టికెట్ ధరల సమస్య ఒక కొలిక్కి వస్తుందనుకునే సమయంలో మంత్రి గౌతమ్ రెడ్డి మరణించడంతో కాస్త ఆలస్యం అయ్యిందని పేర్కొన్నారు రోజా. ఈ లోగా సినిమా రిలీజ్ అయ్యిందని రోజా వివరణ ఇచ్చారు. అలాగే తన సినిమాను అడ్డుపెట్టుకొని తమ పార్టీని నిలబెట్టుకోవాలని పవన్ రాజకీయం చేస్తున్నారని రాజా ఫైర్ అయ్యారు.
మరోవైపు అల్లు అర్జున్ పుష్ప.. బాలకృష్ణ అఖండ సినిమాలకు ఏ రేట్లయితే ఉన్నాయో.. ఇప్పుడూ అవే రేట్స్ భీమ్లానాయక్ కు ఉన్నాయని రోజా వ్యాఖ్యనించారు. వాళ్లకు జరగని అన్యాయం పవన్ కు ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు. రేట్లు పెంచుకోవాలంటే జాయింట్ కలెక్టర్లకు అప్లై చేసుకోవచ్చు కదా అంటూ వ్యాఖ్యానించారు.
టికెట్ ధరల విషయంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఏపీ ప్రభుత్వం మేలు చేసిందన్నారు రోజా. మూడు వందలకు పైగా ధర చెల్లించి కొనే టికెట్.. ఇప్పుడు రూ. 150 కే దొరికిందని సంతోష పడాల్సింది పోయి.. ఎందుకు ఆవేశపడుతున్నారో అర్ధం కావట్లేదని వ్యాఖ్యానించారు. ఇక.. రోజా తాజా వ్యాఖ్యల పైన అటు పవన్ క్యాంప్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలంటున్నారు సినిమా విశ్లేషకులు.