ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా ఇవాళ దుర్గమ్మ దర్శనం కోసం ఇంద్రకీలాద్రి వచ్చారు. అమ్మవారి దర్శనానికి వెళ్తే అక్కడున్న పూజారులు ధన వాహన సంపూర్ణ ఐశ్వర్య ప్రాప్తిరస్తు.. అని దీవిస్తారు. దర్శనానికి కొద్ది గంటల ముందే రోజాకు అవన్నీ సిద్ధించాయి. రోజాకు రూ.3.82 లక్షల జీత భత్యాలు, క్యాబినెట్ హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇంకా ఎంతమందికి జగన్ సర్కార్ క్యాబినెట్ ర్యాంకు, ఇంత భారీ వేతనాలు అందిస్తారో చూడాలి.
గుంటూరు: ఏపీఐఐసీ చైర్‌పర్సన్ హోదాలో ఉన్న సినీ నటి, జబర్దస్త్ ఫేమ్ రోజాకు జీతభత్యాల క్రింద నెలకి 3.82 లక్షల రూపాయలు ఇచ్చేలా ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. క్యాబినెట్ ర్యాంకు కింద రోజాకు ఈ జీతభత్యాలు లభిస్తాయి. ఇందులో రూ.2 లక్షలు జీతంగా నిర్ణయించిన ప్రభుత్వం, వాహన సౌకర్యం కింద 60 వేలు, అధికార క్వార్టర్స్‌లో నివాసం లేకపోతే ప్రత్యామ్నాయ వసతి సౌకర్యానికి 50 వేలు, మొబైల్ ఫోన్ చార్జీలకు 2 వేలు, వ్యక్తిగత సిబ్బంది జీతభత్యాలు చెల్లించేందుకు 70 వేలు అందిస్తారు. ఇవిగాకుండా ఇతర క్యాబినెట్ ర్యాంకు నేతలకు వున్న అన్ని సదుపాయాలూ రోజాకు కూడా అందుతాయి.