రోజా ‘జబర్దస్త్’ నవ్వులు మిస్సవ్వాల్సిందేనా.?
అదేంటని ఆశ్చర్యపోవద్దు. ఇది రూఢీగా నిజం. వారంవారం ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్ ఈటీవీలో మల్లెమాల వారందించే నవ్వుల షో ‘జబర్దస్త్’ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ‘షో’లో మనల్ని నవ్వించే కమెడియన్స్ ఎంత పాపులర్ అయిపోయారో కూడా మనందరికీ తెలుసు. జబర్దస్త్ నుంచి చాలామంది డైరెక్టుగా సినిమా అవకాశాలనే అందిపుచ్చుకున్నారు.
జబర్దస్త్ షోలో పార్టిసిపెంట్స్ ఎంత పాపులరో యాంకర్లుగా వ్యవహరించే అనసూయా అండ్ రష్మి కూడా అంత పాపులర్. కేవలం ఈ షో ద్వారానే వీళ్లిద్దరూ విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. సిన్మాల్లో కూడా ఛాన్సెస్ సంపాదించుకున్నారు.
ఎంతమంది ఎన్నిచెప్పినా ‘జబర్దస్త్’ అంటే మెయిన్‌గా గుర్తొచ్చేది మన మెగా బ్రదర్ నాగబాబే. నవ్వొచ్చే స్కిట్ అయినా.. నవ్వులపాలయ్యే స్కిట్టయినా నాగబాబు మాత్రం నోరారా నవ్వే నవ్వు ఆ షోకి ఓ స్పెషల్ అట్రాక్షన్. నవ్వుల గురించి చెప్పేప్పుడు చిరునవ్వు, దోరనవ్వు, పగలబడి నవ్వే నవ్వు.. అంటూ ఎలా చెబుతామో ఈ కేటగిరిలో నాగబాబు నవ్వు అని కొత్తగా యాడ్ చేసుకోవచ్చు. ఇంతమంది గురించి చెప్పి మరి ఎవర్ స్మైలింగ్ హీరోయిన్ రోజా గురించి చెప్పకపోవడం పెద్ద కామెడీ కదండీ..
జబర్దస్త్ షో మొత్తానికీ రోజా ఒక్కరు చాలు. ఓ నవ్వు చాలు.. ముత్యాల జల్లు ఎదలో గుచ్చుకుంటుందీ.. అని కవి గారు అన్నట్టు స్కిట్ అయ్యాక చివర్లో రోజా నవ్వే నవ్వు కోసమే జబర్దస్త్ టీమ్‌తో పాటు ఆడియెన్స్ కూడా ఎదురుచూస్తారు. ఈ షోకి రోజానే సెంటర్ పాయింట్.
రాజకీయాల్లో బిజీగా మారిపోవడంతో రోజా ఇకపై జబర్దస్త్ షోలో కనిపించకపోవచ్చు. ఈ టాక్ ఇప్పటిది కాకపోయినా.. రోజాకు కొత్తగా నామినేటెడ్ పదవి ఒకటి కట్టబెట్టడంతో ఆ వార్త నిజమయ్యేలా ఉంది. పాలిటిక్స్‌లో.. కొత్త పదవీ బాధ్యతల్లో రోజా బాగా బిజీ అయిపోతుండటంతో ఇక ‘జబర్దస్త్’కు ఆమె గుడ్‌బై చెప్పేయడం ఖాయమని తెలుస్తోంది.
ఏ.పీ.ఐ.ఐ.సీ. ఛైర్మన్‌గా రోజాకు బాధ్యతలు పెరగడంతో జబర్దస్త్ షో నుంచి తప్పుకోక తప్పదనే సంకేతాలు వస్తున్నాయి. ఈ వారం ప్రసారమవుతున్న జబర్దస్త్ ప్రోమోలో జడ్జిగా నాగబాబుతో పాటు రోజా కాకుండా డ్యాన్స్‌మాస్టర్ శేఖర్ కనిపించారు. దీంతో ఇక ‘జబర్దస్త్’లో రోజా నవ్వులు ఉండవు అనేది దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.