చిత్తూరు జిల్లాకు చెందిన నారమల్లి శివప్రసాద్ చిన్నతనం నుంచే నాటకాలు అంటే ఎంతో అభిమానం పెంచుకున్నారు. ఎస్వీ మెడికల్ కాలేజీలో పనిచేసే సమయంలో డైరెక్టర్ భారతీ రాజా పరిచయమయ్యారు. కొత్త జేవితాలు మూవీలో 1980లో సుహాసిని భర్తగా శివ ప్రసాద్ కు అవకాశం ఇచ్చారు. ఇలా ఫీల్డ్ లోకి ఎంటర్ అయిన శివ ప్రసాద్ చిన్న పెద్ద వేషాలనే తేడా లేకుండా చాలా మూవీల్లో నటించారు. కొన్ని మూవీల్లో పారితోషికం కూడా తీసుకోలేదు. శివ ప్రసాద్ మూవీ ఎంట్రీ రోజాకు కలిసొచ్చింది. శివ ప్రసాద్ రూపంలో సినీ రాజకీయ గురువు రోజాకు దొరికారు.ప్రేమ తపస్సు మూవీలో రోజాకు తొలిసారి హీరోయిన్ గా రాజేంద్రప్రసాద్ సరసన ఆ చిత్ర దర్శకుడైన శివ ప్రసాద్ అవకాశమిచ్చారు.
అప్పటికే 60కి పైగా సినిమాల్లో నటించిన శివ ప్రసాద్ దర్శకుడిగా తొలి సినిమా మొదలుపెట్టినప్పుడు హీరోగా రాజేంద్రప్రసాద్, హీరోయిన్‌గా కొత్త అమ్మాయిని తీసుకోవాలనుకున్నారు. రాయలసీమ అమ్మాయి కోసం ప్రయత్నించారు. తగిన అమ్మాయి కనపడలేదు. చివరకు కేరళ అమ్మాయి కోసం ఓ నర్సింగ్ ఇన్‌స్టిట్యూట్‌కు వెళ్లారు. లోపలికి వెళ్ళగా అక్కడున్న వాళ్లలో ఎవరూ నచ్చలేదు. అక్కడ ఆఫీసు రూములో ఓ అమ్మాయి ఫొటో కనిపించింది. చక్కగా ఉంది. అక్కడున్న సూపరింటెండెంట్ సహాయంతో ఆ అమ్మాయి ఇంటికి వెళ్లారు. శివ ప్రసాద్ ను చూడగానే ఆ అమ్మాయి బిత్తర చూపులు చూసింది. ఆ చూపులు శివ ప్రసాద్ కు బాగా నచ్చాయి. అడగగానే సినిమాల్లో నటించేందుకు ఒప్పుకుంది. చిత్తూరు జిల్లాకే చెందిన ఆమె పేరు ‘శ్రీలత’. భారతీరాజా దగ్గరకు తీసుకువెళ్లి రోజాగా పేరు మార్చాం. అలా ‘ప్రేమ తపస్సు’ సినిమాలో రోజాకు అవకాశం వచ్చింది. సినిమా మధ్యలో ఆ అమ్మాయిని తీసేస్తేనే డబ్బులు ఇస్తానని ఫైనాన్షియర్ అన్నాడు. కానీ శివ ప్రసాద్ ఒప్పుకోలేదు. ఆయనే సొంతంగా సినిమా తీశారు. 1991లో విడుదలైన ఆ సినిమా యావరేజ్‌గా సక్సెస్ అయింది.
ఆ తర్వాత రోజాను రామానాయుడుకి పరిచయం చేశారు. ఇక రోజా వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో చేసి తమిళంలోనూ పెద్ద హీరోయిన్ అయింది. శోభన్ బాబు హీరోగా వచ్చిన సర్పయాగం సినిమాలో రోజా నటించినా హీరోయిన్‌గా పరిచయం అయింది మాత్రం శివ ప్రసాద్ ప్రేమతపస్సుతోనే.
శివ ప్రసాద్ తన ప్రతిభకు పదును పెట్టి నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించారు. ప్రేమ తపస్సు, టోపి రాజా స్వీటీ రోజా, ఇల్లాలు, కొక్కొరొకో సినిమాలకు దర్శకత్వం వహించారు.
రోజా రాజకీయ రంగ ప్రవేశం కూడా శివ ప్రసాద్ ద్వారానే జరిగింది. 1999లో సత్యవేడు ఎమ్మెల్యేగా శివ ప్రసాద్ పోటీ చేసినప్పుడు రోజా ఎన్నికల ప్రచారానికి వచ్చింది. పిలవగానే ప్రచారం చేసింది. ఆ సమయంలోనే రోజా చంద్రబాబు నాయుడు దృష్టిలో పడింది. అలా టీడీపీలో చేరింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి రోజా మారారు. వైఎస్ మరణం తర్వాత జగన్ మోహన్ రెడ్డికి అండగా రోజా ఉన్నారు.