జబర్ధస్త్ కామెడీ షో వేదికపై ఆర్కే రోజా కంటతడి పెట్టుకున్నారు. 2013 నుంచి ఇప్పటి వరకూ ఆ షోకు జడ్జీగా నవ్వులు పూయించిన ఆమె.. ఇటీవల మంత్రి కావటంతో షోకు వీడ్కోలు పలికారు. ఈనేపథ్యంలో జబర్దస్త్ టీం సభ్యులు రోజా పాల్గొన్న చివరి ఎపిసోడ్‌లో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె ఎమోషనల్ అయ్యారు.
రోజా నగరి నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గి, తాజాగా మంత్రి పదవి చేపట్టారు. ఇటీవల జరిగిన ఏపీ మంత్రివర్గ కూర్పులో భాగంగా ఆమెకు వైసీపీ ప్రభుత్వం టూరిజం శాఖ అప్పగించింది. ఈ మేరకు రోజా ఏపీ పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ధిశాఖ మంత్రిగా రోజా గురువారం బాధ్యతలు చేపట్టారు. అయితే, ఇప్పుడు తాను మంత్రిని కావడంతో బాధ్యతలు పెరిగాయని, ఇకపై సినిమాలు, టీవీ షోలు చేయలేనని ఇటీవలే ప్రకటించారు.
ఈ క్రమంలో జబర్దస్త్ టీం సభ్యులు రోజాకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఆమె పాల్గొన్న చివరి ఎపిసోడ్‌లో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రోజా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. రెండుసార్లు ఎమ్మెల్యే అయినప్పుడు జబర్దస్త్‌లోనే ఉన్నానని, ఇప్పుడు మంత్రి అయినప్పుడు కూడా ఇక్కడే ఉన్నానని ఆనందం వ్యక్తం చేశారు. అయితే, ఓ వైపు మంత్రి పదవి దొరికిన సంతోషంతో పాటు మరో వైపు ‘జబర్దస్త్’ కార్యక్రమం మిస్ అవుతానని రోజా కన్నీటి పర్యంతమయ్యారు.
అయితే, తనకు సేవ చేయడం ఎంతో ఇష్టమని, అందుకే జబర్దస్త్ వంటి ఇష్టమైన కార్యక్రమాలను వదులుకోవాల్సి వస్తోందని భావోద్వేగానికి లోనయ్యారు. తనకు అవకాశమిచ్చిన ఈటీవీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఇక ఆమె మాట్లాడుతంటే స్టేజ్‌పై ఉన్న జబర్దస్త్ ఆర్టిస్టులు, యాంకర్లు, మిగిలిన వారు కూడా కంటతడి పెట్టుకున్నారు.
తెలుగు తెరపై హీరోయిన్గా ఓ వెలుగువెలిగిన రోజా.. 2004లో రాజకీయాల్లోకి వచ్చారు. మొదట టీడీపీ అభ్యర్థిగా నగరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ టికెట్‌పై నగరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తొలి విడతలోనే ఆమెకు మంత్రి పదవి వస్తుందని భావించినా.. అది జరగలేదు. రెండో విడతలో రోజాను తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.