వీరసింహారెడ్డి విజయంతో ఫుల్ హ్యాపీలో ఉన్నారు బాలయ్య. అయితే.. సక్సెస్ కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు అట్టి రాజేశాయి. అక్కినేనో.. తొక్కినేని.. ఆ రంగారావు.. ఈ రంగారావు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై వివాదం మొదలైంది. అటు ఏఎన్ఆర్ ఫ్యాన్స్, ఇటు ఎస్వీఆర్ ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. ఈక్రమంలో మంత్రి రోజా కూడా రియాక్ట్ అయ్యారు.
బాలకృష్ణ అక్కినేనిని అవమానించడం తప్పన్నారు రోజా. ఎన్టీఆర్ ని అవమానిస్తే వీళ్ళు ఎంత బాధ పడతారో, అదే విధంగా అక్కినేని అభిమానులు కూడా బాధపడతారని తెలిపారు. ఈ విషయంపై ఇప్పటి వరకూ బాలకృష్ణ తప్పును సరిదిద్దుకోలేదని.. ఆయన ఎప్పుడూ అంతే అంటూ వ్యాఖ్యానించారు.
ఇక పాలిటిక్స్ గురించి మాట్లాడుతూ.. పవన్, లోకేష్ పై విరుచుకుపడ్డారు రోజా. పవన్ కళ్యాణ్ కన్ఫ్యూజ్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. పొత్తులపై రోజుకో మాట మాట్లాడుతున్నారని అన్నారు. జనసేన పార్టీకి 26 జిల్లాల్లో అధ్యక్షులే లేరని ఎద్దేవ చేశారు. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు లేరని సెటైర్లు వేశారు. అది జనసేన కాదు చంద్రసేన అని విమర్శించారు.
లోకేష్ పైనా తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు మంత్రి. లోకేష్ కౌన్సిలర్ కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని వ్యాఖ్యానించారు. అలాంటి వ్యక్తి పాదయాత్రకు తాము ఎందుకు అనుమతి ఇవ్వాలని ప్రశ్నించారు. లోకేష్ పాదయాత్రతో ఏదేదో జరిగిపోతుందని భ్రమలో ఉన్నారని.. మొదటి రోజే వాళ్ళకి అంతలేదు అని అర్థం అవుతుందని విమర్శించారు. లోకేష్ తెలుగుదేశం పార్టీలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ అన్ని విధాలుగా దెబ్బతిందని ఎద్దేవ చేశారు.