బంగారు భారత్ అంటూ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్నారు సీఎం కేసీఆర్. అయితే.. బంగారు తెలంగాణ సంగతేంటనేది ప్రతిపక్షాల ప్రశ్న. రాష్ట్ర సమస్యల పరిష్కారానికే దిక్కులేదు.. జాతీయ రాజకీయాలకు వెళ్లి ఏం ఉద్ధరిస్తారని తెగ తిట్టిపోస్తున్నాయి.
ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతున్న టీఆర్‌ఎస్ వర్గాలు.. మా సారు సూపర్.. ఆయన పాలన బంపర్ అంటూ సోషల్ మీడియాలో తెగ ఊదరగొడుతున్నారు. ఇదిగో అభివృద్ధి అంటూ రకరకాల ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు. మీది అంత గొప్ప పాలనే అయితే.. దీని సంగతేంటని ప్రభుత్వ స్కూల్ లో పెచ్చులు ఊడిన ఇష్యూని హైలెట్ చేస్తున్నాయి ప్రతిపక్షాలు.
హన్మకొండ జిల్లా హసన్ పర్తి జెడ్పీ హైస్కూల్ లో పైకప్పు పెచ్చులు ఊడిపడి విద్యార్థులకు గాయాలయ్యాయి. పదో తరగతి స్టూడెంట్స్ ఉన్న గదిలో ఇది జరిగింది. పైకప్పు పెచ్చులు హఠాత్తుగా ఊడిపడటంతో ఐదుగురు విద్యార్థినులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు టీచర్లు.
ఘటన గురించి తెలిసిన వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ దగ్గరకు పరుగులు తీశారు. పెచ్చులు ఊడే వరకు ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా? అని మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వంపై ప్రతిపక్షాలు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు.