
ప్లాస్టిక్ వల్ల కలిగే ప్రమాదాన్ని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించగా…ఇప్పుడున్న ప్లాస్టిక్ ను ఏం చేయాలనే దానిపై వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు.తాజాగా హర్యానాలోని హిసార్ జిల్లా మున్సిపాల్టీ 20 వాడిన ప్లాస్టిక్ బాటిళ్లు తీసుకొస్తే తినుబండారాలను ఇస్తామని ప్రకటించింది. దీని కోసం హిసార్ మున్సిపల్ కార్పోరేషన్ స్థానికంగా ఉన్న రెండు డాబాలతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్లాస్టిక్ బాటిళ్లు ఇచ్చిన వారికి దాల్ రోటీతో పాటు సలాడ్ ఇస్తున్నారు. చెత్త ఏరుకునే వారి ఆకలిని తీర్చడంతో పాటు ఎక్కడ పడితే అక్కడ పడి ఉన్న ప్లాస్టిక్ ఒక చోటుకు చేర్చి వాటిని మళ్లీ ఉపయోగిస్తున్నామని మున్సీపాల్టీ ఎస్ఈ తెలిపారు. హిసార్ మున్సిపాల్టీ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రశంసించారు.