తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అందులో ముఖ్యంగా భారత రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్, తెలంగాణ ఏర్పాటుపై మోడీ వ్యాఖ్యలను ప్రధాన అంశాలుగా తీసుకొని చర్చించారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ, బీఎస్పీ తెలంగాణ చీఫ్ కో ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, పౌర హక్కుల నేత ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ, సీనియర్ జర్నలిస్టులు పీబీ శ్రీనివాస్, జయసారథి రెడ్డి, పీవో డబ్ల్యూ నేత సంధ్య, కాంగ్రెస్ నేత మానవతారాయ్, అధ్యయన వేదిక అధ్యక్షులు బి. వేణుగోపాల్ రెడ్డి, జనరల్ సెక్రటరీ సాధిక్, ట్రెజరర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ అధ్యయన వేదిక అధ్యక్షుడు బి. వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. రాజ్యాంగం పార్టీ ఫిరాయింపులు చేయమని చెప్పలేదని మండిపడ్డారు. ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. రాజ్యాంగం అమలు చేయకుండా రాజ్యాంగం మార్చాలి అనడం తమ మూర్ఖత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. దళితులకు రిజర్వేషన్ పెంచాలంటే పెంచుకోవచ్చు.. కానీ.. దీనికి రాజ్యాంగం మార్చాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇక మోడీ వ్యాఖ్యలను వి మర్శ నాత్మకంగా ఉన్నయన్నారు. తెలంగాణ ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిందని వ్యాఖ్యనించారు వేణుగోపాల్ రెడ్డి.
మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. దేశానికి కొత్త రాజ్యాంగం రాయాలని కేసీఆర్ తన స్థాయిని మరిచి మత్తులో మాట్లాడారని ఆరోపించారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలని దళితుల భుజాన తుపాకీ పెట్టి కేసీఆర్ మాట్లాడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దళితులకు రిజర్వేషన్లు పెంచాలంటే కొత్త రాజ్యాంగం రావాలని తన ఆలోచనను కేసీఆర్ చెప్పకనే చెప్పారని అన్నారు. దళితులను కించపరిచినట్టు మాట్లాడిన కేసీఆర్ పై అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగంపై దళితులకు మాట్లాడే హక్కు లేదంటున్న కేసీఆర్ పై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్లలో కేసులు పెడతాం అని హెచ్చరించారు. కేసీఆర్ దళితులను అవమానించినందుకు గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. వచ్చే ప్రభుత్వంలో కేసీఆర్ ను జైలుకు పోవడం ఖాయం అన్నారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం పై ప్రతీ భారతీయ పైరుడికి హక్కు ఉంటుందని అన్నారు మందకృష్ణ మాదిగ.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. కేసీఆర్ మేం లేకపోతే నువ్ దీక్ష చేద్దువా..? అని ప్రశ్నించారు. 105 రాజ్యాంగ సవరణలు జరిగాయన్నారు. ఇవి అవసరం లేదని చెప్పగలవా..? అని నిలదీశారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ఉంటే.. తన ఆటలు సాగవని కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చలనుకుంటున్నారని అన్నారు. దళితుడు అందెశ్రీ రాసిన పాటను రాష్ట్ర గీతం చేయకుండా.. తన పాటను చేసేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నాడని ఆరోపించారు. అంబేడ్కర్ పేరిట ఉన్న ప్రాజెక్ట్ ను మార్చినట్టే.. రాజ్యాంగాన్ని లేకుండా చేసేందుకు కేసీఆర్ కుట్రలు చేస్తున్నాడని వ్యాఖ్యనించారు. రాష్ట్రంలో రిజర్వేషన్లు పెంచకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ లను కేసీఆర్ మోసం చేస్తున్నాడని ఆరోపించారు. ఇతర రాష్ట్రాల్లో కుల జనాభా పరంగా రిజర్వేషన్లు అమలవుతున్నాయన్నారు. కేసీఆర్.. నీ మోసాలను అన్నివర్గాల ప్రజలు గమనిస్తున్నారు.. నీకు నీ కుటుంబ పాలనకు ఘోరి కట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు ప్రవీణ్ కుమార్.
జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. మోడీ తెలంగాణపై, కేసీఆర్ రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలన్నీ స్ర్కీప్ట్ ప్రకారం జరుగుతున్నవేనని ఆరోపించారు. తెలంగాణలో వేల కోట్ల స్కామ్ జరుగుతోందని అన్నారు. వాటిని ప్రజలు గమనించాల్సిన అవసరం ఉందన్నారు. 90 శాతం దళిత బహుజనులకు ఎన్ని పదవులు వచ్చాయని ప్రశ్రించారు. వీటిపై కేసీఆర్ కు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ విద్యారంగాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగాలు దళిత బహుజనులకు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. రైతులు, విద్యార్థులు, నిరుద్యోగుల గురించి మాట్లాడకుండా.. రాజ్యాంగం గురించి మాట్లాడటానికి సిగ్గుండాలని అన్నారు శ్రీనివాస్ గౌడ్.
విరాహత్ అలీ మాట్లాడుతూ.. రాజ్యాంగంపై కేసీఆర్ అక్కసు కక్కుతున్నాడని అన్నారు. రాజ్యాంగం కావాలా.. రద్దు చేయాలా అనే దానిపై చర్చకు రావాలని కేసీఆర్ కు సవాల్ చేస్తున్నామన్నారు. దోపిడి దారులంతా జైలుకు పోవాల్సిందే.. సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు బయటపెట్టాలని అన్నారు. అదే జరిగితే ముందుగా జైలుకు పోయేది కేసీఆర్ కుటుంబమేనన్నారు. శాశ్వత సీఎంగా ఉండేందుకే చైనా రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాడని ఆరోపించారు. రాజ్యాంగాన్ని రద్దు చేస్తే.. రాతియుగం కాలం వస్తదని అన్నారు అలీ.
ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ మాట్లాడుతూ.. రాజ్యాంగంపై దాడి మొదలు పెట్టింది కేసీఆర్ కాదు మోడీ అని అన్నారు. కేసీఆర్ ఏకకాలంలో దాడికి దిగారని అన్నారు. ఆద్దరు కలిసి ఆర్టికల్ 3 మీద దాడికి పాల్పడుతున్నారని ఆరోపించారు. రాజ్యాంగం ఇచ్చిన విలువలతోనే దళిత బహుజనులు జీవిస్తున్నారని అన్నారు. దేశ కాషాయికరణలో భాగంగానే అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంపై వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. విశ్వసనీయత లేని వ్యక్తులే రాజ్యాంగంపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు లక్ష్మణ్.