– మీడియా స్వేచ్ఛపై మీటింగ్ బాధాకరం
– జర్నలిస్టులపై అక్రమ కేసులా?
– వాళ్లు పోలీసులా? కేసీఆర్ సొంత మనుషులా?
– ఇందుకేనా తెలంగాణ సాధించుకుంది?
– కేసీఆర్ పై ఈటల ఫైర్
ప్రశ్నిస్తే అరెస్ట్ లు.. నిలదీస్తే కేసులు.. తెలంగాణలో కొన్నాళ్లుగా జరుగుతోన్న తంతు ఇదేనని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మీడియా స్వేచ్ఛ-ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఇలాంటి సమావేశాలు తెలంగాణలో నిర్వహించాల్సి రావడం బాధాకరమన్నారు. మీడియా మొత్తాన్ని టీఆర్ఎస్ తన చేతుల్లో పెట్టుకుందుని విమర్శించారు. యూట్యూబ్ ఛానల్స్ లో తప్పుడు వార్తలు రాస్తున్నారని చెబుతున్న మీరు… తన మీద కావాలనే కొన్ని పత్రికలు, ఛానళ్లు తప్పుడు వార్తలు రాశాయని.. దానిపై ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు.
యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కొనుక్కునే ప్రయత్నం చేశారన్న ఈటల… అమ్ముడు పోకుండా ఉన్నవారిని బెదిరిస్తూ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. దీనిపై డీజీపీ సమాధానం చెప్పాలన్నారు. జర్నలిస్ట్ లను తీసుకుపోతున్నది పోలీసులా? కేసీఆర్ సొంత మనుషులా? అని ప్రశ్నించారు. ఏమన్నా తప్పు చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి గానీ.. దొంగల్లాగా ఈ చర్యలు ఏంటని మండిపడ్డారు. మావోయిస్టుల సమయంలో ఎలాంటి హింస జరిగిందో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అదే చేస్తోందని ఆరోపించారు.
కేసీఆర్ కు ప్రజలు అధికారం ఇచ్చింది వేధించడానికి కాదన్నారు ఈటల. సరైన సమయంలో ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. హుజూరాబాద్ తీర్పు యావత్ తెలంగాణలో పునరావృతం కాబోతుందని జోస్యం చెప్పారు. మేధావులు కూడా ప్రభుత్వానికి మద్దతు పలకడం బాధాకరమన్న ఈటల.. ప్రత్రికా స్వేచ్ఛ పత్రికల కోసం కాదు ప్రజల కోసమని చెప్పారు. వాటికి స్వేచ్ఛ ఉన్నప్పుడే ప్రజలు స్వేచ్ఛగా ఉంటారన్నారు. నాయకులు, మేధావులు, పార్టీలు సిద్దాంతాలు పక్కనపెట్టి ఈ నిర్బంధానికి వ్యతిరేకంగా గళం విప్పాలని పిలుపునిచ్చారు. ఐక్యంగా ఉందాం.. చట్టపరంగా కొట్లాడదామని చెప్పారు.
హుజూరాబాద్ లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని విమర్శలు చేశారు రాజేందర్. రాజ్యం ఎప్పుడయితే హక్కుల మీద, పత్రికల మీద దాడి చేస్తుందో అది పతనం అంచున ఉన్నట్టేనని చెప్పారు. దమ్మున్న వారు, ప్రజాస్వామ్యయుతంగా పాలించే వారు ఇలాంటి పనులు చేయరన్నారు. ఓటు వేసే స్వేచ్ఛను కూడా హరించివేసిన కేసీఆర్… హుజూరాబాద్ లో డబ్బుతో, జీవోలతో ప్రజలను లొంగదీసుకోవడం సాధ్యం కాకపోతే వారిని భయబ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. హుజూరాబాద్ లో ఒక్క ఓటు మీద 26 వేల రూపాయలు.. మొత్తంగా 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని వాళ్లే చెప్పుకుంటున్నారని అన్నారు. దళిత బందు, రైతు బందు డబ్బులు, పెన్షన్లు ఇలా అన్నీ ఇచ్చినా ప్రజలు ధర్మం వైపు నిలబడి.. నియంతృత్వం, అహంకారాన్ని ఓడించారని చెప్పారు ఈటల రాజేందర్.