దేశాన్ని, రాష్ట్రాన్ని కార్పొరేట్ శక్తులు ఏలుతున్నాయని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో “మీడియా స్వేచ్ఛపై కార్పొరేట్ ఆధిపత్యం-సమాజంపై ప్రభావం” అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దీనికి పలువురు నేతలు, జర్నలిస్టులు, మేధావులు, ఉద్యమకారులు హాజరయ్యారు. మీడియాను తమ కబంధ హస్తాల్లో పెట్టుకుని కొర్పొరేట్ శక్తులు పేట్రేగిపోతున్నాయని మండిపడ్డారు.
రౌండ్ టేబుల్ సమావేశంలో ఎవరెవరు ఏమన్నారంటే..?
పాశం యాదగిరి, సీనియర్ సంపాదకులు
కార్పొరేట్ చేతిలోకి మీడియా వెళ్లిపోయింది. రాజకీయ నేతలు ఛానల్స్, పేపర్స్ నడిపిస్తున్నారు. జనానికి సంబంధించిన వార్తలను చూపించడం లేదు. తెలంగాణ వద్దు అన్నవాళ్ళు, ఉద్యమకారులను కొట్టినోళ్లు కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రులు అయ్యారు. చివరకు కాంట్రాక్టర్లు మొత్తం వాళ్లే. కేసీఆర్ బర్త్ డే రోజు చిన్నపిల్లలకు బీర్ బాటిల్స్ ఇచ్చారు. సమాజం ఎటు పోతోంది. రాష్ట్రంలో దుశ్శాసన పర్వం నడుస్తోంది. మీడియా కుడా పెద్ద మాఫియాగా మారింది. మేఘా కృష్ణారెడ్డి ఇక్కడ ఎట్లా ఉంటాడు.. తరిమికొట్టాలి. సీజేఐని తిట్టినా ఎవరూ పట్టించుకోని పరిస్థితి వచ్చింది. ఇందుకోసం అందరం పోరాడాలి. లీగల్ గా ఎదుర్కోవాలి.
గాదె ఇన్నయ్య, తెలంగాణ ఉద్యమకారుడు
కొన్ని మీడియా సంస్థలు అన్యాయానికి గురైతే అందరూ కలసికట్టుగా పోరాడాలి. పార్టీలు కూడా అండగా నిలబడాలి. అపొజిషన్ లో ఉన్న రేవంత్, బండి సంజయ్ ఎవరికి భయపడుతున్నారు. మేఘా కృష్ణారెడ్డికా? లేక.. కేసీఆర్ కా? చెప్పాలి. ఇకనైనా మేల్కొనే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొని మీడియాను దక్కించుకోవాలి.
కోదండరాం, టీజేఎస్ అధ్యక్షుడు
తెలంగాణ వచ్చాక ఇంత అన్యాయంగా మారుతుందని అనుకోలేదు. మేఘా కృష్ణారెడ్డి కుబేరుడు అయ్యాడు. మనం బికారులం అయినం. చిన్న కాంట్రాక్టర్లకు అవకాశం ఇవ్వాలి. ముక్కలు చేసి ఇవ్వవచ్చు. అది జరుగలేదు. మేఘా మీద వార్త వేస్తే ఖమ్మంలో కేసు వేశారు. ఆర్డర్ తో ఎవరు నోరు మెదవద్దని హుకూం జారీ చేశారు. ధరణితో భూములు లోబర్చుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అన్ని వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని సర్కార్ ప్లాన్ చేసింది. అది మేఘా ఆఫీస్ నుంచా? మరో ఆఫీస్ నుంచా? అన్నది తెలియదు.
రాజనర్సింహ, మాజీ డిప్యూటీ సీఎం
సిద్ధాంతాలకు భిన్నంగా కొన్ని మీడియా సంస్థలు నడుస్తున్నాయి. సోషల్ మీడియా భయపడకుండా సమస్యలపై పోరాడుతోంది. అధికార పార్టీ అహంకారంతో మీడియా అడ్డం పెట్టుకొని పాలన కొనసాగిస్తోంది. సీఎం అంటే ఆదర్శంగా ఉండాలి. కానీ.. నేడు విలువలకు తిలోదకాలిచ్చారు. రజత్ కుమార్ లాంటి అధికారులు అండగా ఉండటంతో యథేచ్ఛగా పాలిస్తున్నారు. ఆనాడు ఓట్ల గల్లంతులో ఆయనకు భాగస్వామ్యం ఉంది. అందుకే అందలం ఎక్కుతున్నారు. రజత్ కుమార్ పై ఆరోపణలు వస్తే ఎంక్వైరీ వేయలేదు. కేంద్రం చర్యలు తీసుకోలేదు. కాళేశ్వరంలో లక్షకోట్లకు పైగా దోపిడీ జరిగింది. రీ డిజైన్ చేయడం డబ్బులు కొట్టేయడం చేశారు. ఈ కాంట్రాక్టర్లు ఎవరు? ఇప్పుడు అనిపిస్తోంది తెలంగాణ ఎందుకు వచ్చిందని. ధరణితో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతుబంధు ఎవరికి ఇస్తున్నారు. సమైక్య రాష్ట్రంలోనే న్యాయం జరిగిందని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. రాష్ట్రాన్ని దుష్టుడు పాలిస్తున్నాడు. ఇది తెలంగాణ దౌర్భాగ్యం.
విఠల్, సీనియర్ జర్నలిస్ట్
కార్పొరేట్ మీడియా వచ్చాక ఫ్రీడమ్ ఆఫ్ పర్స్ అయిపోయింది. ఒక ప్రెస్ మీట్ కు వెళ్తే.. కవర్ లో 5వందలు ఇవ్వకపోతే అందరూ గుమిగూడి అడుక్కునే స్థితికి తీసుకొచ్చారు. ఒకప్పుడు మీ పత్రిక ఎడిటర్ ఎవరు అని అడిగేవారు. ఇప్పుడు మీ పత్రిక ఓనర్ ఎవరు.. ఆయన ఏ పార్టీ జెండా మోస్తున్నాడు. ఏ కులానికి చెందినవాడు అనే పరిస్థితి. రెడ్ మీడియాని చూశాం.. ఎల్లో మీడియాని చూశాం.. ఇప్పుడు పింక్ మీడియా నడుస్తోంది. ఓనర్ బ్రోకరిజం చేస్తూ పేపర్, ఛానల్ నడుపుతుంటే.. జర్నలిస్టులకి ఆత్మగౌరవం ఎక్కడ ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఉన్న నాలుగు వ్యవస్థల్లో లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడీషియరీ కార్పొరేట్ శక్తుల్లో ఉంది. కార్పొరేట్ మీడియా కూడా వచ్చేసింది. ఇవాళ మెయిన్ స్ట్రీమ్ మీడియాకు పది వేల వ్యూస్ కూడా రావడం లేదు. తొలివెలుగు సహా ఇతర సోషల్ మీడియా ఛానల్స్ కు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. సీఎం ప్రెస్ మీట్ కు వెళ్తున్నవాళ్లు సరైన ప్రశ్నలు అడుగుతున్నారా? కొర్పొరేట్ మీడియా ఈజ్ డేంజరస్ టు సొసైటీ. మేఘా కృష్ణారెడ్డి ఎక్కడి నుంచి వచ్చాడు. డొక్కు బండి వాడిన అతను.. ఇవాళ ఫోర్బ్స్ లిస్ట్ లోకి ఎలా వచ్చాడని క్లియర్ గా ఎవరైనా వార్తలు రాశారా? రెండు జీవ నదులను చెరబట్టి సొమ్ము చేసుకుంటున్నారు. కాంట్రాక్టులన్నీ మేఘాకే. అన్ని రాజకీయ పార్టీలకు డబ్బులు ఇస్తున్నాడు మేఘా కృష్ణారెడ్డి. అందరం కలిసి పోరాడాలి. మీడియాను కమ్మేసిన కార్పొరేట్ శక్తులను తరిమికొడదాం.
శ్రీనివాసరెడ్డి, ఐజేయూ జాతీయ అధ్యక్షుడు
ఒక్క యాడ్ ఇస్తే పత్రిక లొంగిపోవాల్సిందేనా? మేఘా కృష్ణారెడ్డి పరువు ఎక్కడ పోయిందో చెప్పాలి. అత్యంత విలాసవంతమైన హోటల్ లో అధికారి ఇంఇ పెళ్లి కార్యక్రమం చేసుకుంటే మేఘా కంపెనీ డబ్బు చెల్లించినట్లు మీడియా తేల్చింది. ఈ విషయంలో కోర్టులో కూడా సరైన విధంగా తీర్పు రాలేదు.
మీడియా వ్యాపారంగా మారిపోయింది. దేశంలో చాలా పత్రికలు బిజినెస్ గానే నడుస్తున్నాయి. అందుకే నేషనల్ ప్రెస్ కమిషన్ కోసం 15 ఏళ్ళు అయినా అమల్లోకి రావడం లేదు. విదేశాల్లో ఇలా లేదు.
ప్రొ.హరగోపాల్, తెలంగాణ ఉద్యమకారుడు
స్వేచ్ఛ, సమానత్వం కోసం ఎన్నో త్యాగాలు చేశాం. కానీ.. ఇప్పుడు మొత్తం జర్నలిజం వైఖరి మారిపోయింది. రాష్ట్రం ఏర్పడినా కూడా ప్రజాస్వామ్యం నిలబడలేని స్థితి కొనసాగుతోంది. నా శిష్యులు ఐఏఎస్, ఐపీఎస్ లు అయ్యారు. మొదట్లో బాగా పనిచేస్తున్నామన్నారు. కానీ.. తమకు విలువ లేదని మారిపోవాల్సి వచ్చిందని చెప్పారు. అది విని ఎంతో బాధేసింది. పత్రికలు, ఛానల్స్ ను కొనేసి ఇష్టారాజ్యంగా నడుపుకొనేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇదేంటని సీఎంను, మంత్రులను ఎవరినీ అడగలేని పరిస్థితి వచ్చింది. ప్రశ్నిస్తామని నా లాంటి వారిని పిలవొద్దని భావిస్తున్నారు. ఎంత దారుణంగా మారారో అర్థం అవుతోంది. సమాజంలో అసంతృప్తి ఉంది. వివిధ సమస్యలు వెంటాడుతున్నాయి.