శ్రీరామనవమి ఉత్సవాలకు రాష్ట్రం వ్యాప్తంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని రామాలయాలు శోభాయమానంగా వెలిగిపోతున్నాయి. కాగా.. శ్రీరామనవమిని పురస్కరించుకొని.. ఈ నెల 11న శ్రీరామ శోభాయాత్ర చేపట్టనున్నట్లు భాగ్యనగర్ శ్రీరామనవమి ఉత్సవ సమితి వెల్లడించింది. సీతారాంబాగ్ ద్రౌపది గార్డెన్స్ నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు శోభాయాత్ర మొదలై.. రాత్రి 8 గంటలకు సుల్తాన్ బజార్ చేరుకోనున్నట్లు తెలిపింది.
శోభాయాత్ర సీతారాం బాగ్ టెంపుల్, బోయిగూడ కమాన్, గాంధీ విగ్రహం, బేగంబజార్, సిద్ధంబర్ బజార్, శంకర్‌షేర్ హోటల్, గౌలిగూడ, పుత్లీబౌలి ఎక్స్ రోడ్, కోఠి ఆంధ్రా బ్యాంక్ మీదుగా సుల్తాన్ బజార్ చేరుకోనునున్నట్టు స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో స్వామివారి శోభాయాత్ర జరిగే మార్గంలో పోలీసులు పటిష్ట బందోబస్తు చేపట్టారు. ఈ మార్గాల్లో వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. పోలీసులకు వాహనదారులు సహకరించాలని కోరారు.
మల్లేపల్లి జంక్షన్, బోయిగూడ కమాన్, ఆఘపురా జంక్షన్, పురానాపూల్ ఎక్స్ రోడ్, ముస్లింజంగ్ బ్రిడ్జి, అలస్కా టీ జంక్షన్, లేబర్ అడ్డా, అఫ్జల్ గంజ్ టీ జంక్షన్, రంగమహల్ జంక్షన్, పుత్లీబౌలి ఎక్స్ రోడ్, ఆంధ్రా బ్యాంక్ జంక్షన్, డీఎం అండ్ హెచ్ఎస్ జంక్షన్, సుల్తాన్ బజార్ ఎక్స్ రోడ్ వద్ద ట్రాఫిక్‌ను మళ్లించనున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.