15 ఏండ్లలోపు పిల్లల్లో బాల్యంలో సాధారణ వ్యాక్సిన్లు తీసుకున్న వారు కొవిడ్ బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయని ఢిల్లీకి చెందిన మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీ(ఎంఏఎంసీ) నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది.
గతేడాదిలో ఆరునెలలకు పైగా పలువురిపై ఎంఏఎంసీ పరిశోధకులు ఓ అధ్యయనం చేశారు. ఇందులో ఆసక్తికర విషయాలు వెలువడ్డాయి. ఇందులో 15 ఏండ్లలోపు వారిలో ఒక డోసు బీసీజీ, మూడు డోసుల పోలియో, రోటా, పెంటా వ్యాలెట్, ఎంఆర్ వ్యాక్సిన్లు తీసుకున్న వారిపై ఆధ్యయనాన్ని నిర్వహించారు.
కరోనా బారిన పడిన 141 మంది చిన్నారులు ఈ పరిశోధనలో పాల్గొన్నారు. ఆశ్చర్యకరంగా ఇందులో 88 మంది(62.4శాతం)కి తేలికపాటి , 9 (6.4%) మందికి మితమైన , ముగ్గురి(2.1శాతం) తీవ్రమైన లక్షణాలు ఉన్నట్టు అధ్యయనంలో తేలింది.
మిగిలిన 41మంది లక్షణాలు కనిపించనట్టు పరిశోధకలు తెలిపారు. మొత్తం 141 మందిలో 114 మంది పూర్తి స్థాయిలో వ్యాక్సిన్లు తీసుకున్నారని, 24 మంది పాక్షికంగా, ముగ్గురు అసలు ఏ వ్యాక్సిన్లూ తీసుకోలేదని పరిశోధకులు వెల్లడించారు.
‘ పూర్తిగా వ్యాక్సిన్లు తీసుకున్న వారిలో కంటే పాక్షికంగా తీసుకున్న వారిలో కరోనా ఇన్ ఫెక్షన్ లక్షణాలు ఎక్కువగా కనిపించాయి. పూర్తిగా వ్యాక్సిన్లు తీసుకున్న వారిలో (7శాతం)తో పోలిస్తే పాక్షికంగా తీసుకన్న వారిలో మితమైన, తీవ్రమైన వ్యాధి లక్షణాలు (16.7శాతం) ఉన్నాయి” అని నివేదిక తెలిపింది.