దిల్ రాజ్ కుటుంబం నుంచి వచ్చిన హీరో ఆశిష్. రౌడీబాయ్స్ సినిమాతో హీరోగా పరిచయమైన ఈ కుర్రాడు, తన తొలి సినిమాతో ఫ్లాప్ అందుకున్నాడు. ఇప్పుడీ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చింది. జీ5లో పెట్టిన ఈ సినిమాకు వారం రోజుల్లో 10 కోట్ల నిమిషాల స్ట్రీమింగ్ వ్యూస్ వచ్చాయి. అంటే.. నెటిజన్లు ఈ సినిమాను 10 కోట్ల నిమిషాల పాటు చూశారన్నమాట. ఇది చాలా పెద్ద విషయం.
దిల్ రాజు, శిరీష్ ఫ్యామిలీ నుంచి హీరోగా ఇండస్ట్రీ కు పరిచయం అయిన ఆశిష్ (శిరీష్ తనయుడు) హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా తెరకెక్కింది ‘రౌడి బాయ్స్’. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించాడు. దిల్‌రాజు ప్రొడక్షన్.. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ బరిలో తేలిపోయింది. ఇప్పుడీ సినిమాను ఓటీటీ వీక్షకుల కోసం మార్చి 11 నుంచి ‘ZEE 5’లో అందుబాటులోకి తెచ్చారు. అలా వారం రోజుల్లో ఈ సినిమాను 10 కోట్ల నిమిషాల పాటు చూశారు ఆడియన్స్.
ఇంజనీరింగ్, మెడికల్ స్టూడెంట్స్ మధ్య జరిగే ఫైట్ తో పాటు.. ప్రేమ, సహజీవనం లాంటి కాన్సెప్టులతో ఈ సినిమా తెరకెక్కింది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. పాటలతో మంచి ఊపు వచ్చినప్పటికీ.. సంక్రాంతి బరిలో బంగార్రాజు ముందు ఇది నిలవలేకపోయింది. పైగా అప్పుడు అంతోఇంతో కరోనా ప్రభావం కూడా ఉండడంతో.. రౌడీబాయ్స్ నెగ్గుకురాలేకపోయారు.
మొత్తమ్మీద జీ5లో హిట్టయిన ఈ సినిమాను సెలబ్రేట్ చేయాలనుకుంటోంది యూనిట్. ఆ సంస్థతో కలిసి దిల్ రాజు ఓ చిన్న సెలబ్రేషన్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ హీరో తన రెండో సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు.