ఐపీఎల్ లో భాగంగా జరిగిన 39వ మ్యాచ్ లో ఫుణె వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ తలపడ్డాయి. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగింది రాజస్థాన్. టాపార్డర్ పూర్తిగా విఫలమైనా.. లోయర్ ఆర్డర్ బ్యాటర్ రియాన్ పరాగ్(56 నాటౌట్) అద్భుతంగా ఆడడంతో గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది.
ఓపెనర్లు బట్లర్(8), పడిక్కల్(7) పూర్తిగా నిరాశ పరిచారు. అశ్విన్(17), సంజూ శాంసన్(27), మిచెల్(16) ఫర్వాలేదనిపించారు. అయితే.. భారీ అంచనాలు పెట్టుకున్న హెట్మెయర్(3) విఫలం కావడం రాజస్థాన్ ఫ్యాన్స్ ను నిరాశ పరిచింది. పరాగ్ మినహా మిగిలిన వారు ఎవరూ పెద్దగా రాణించలేదు. దీంతో 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ 144 పరుగులు చేసింది.
145 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బెంగళూరు జట్టు పేలవమైన ఆటతీరుతో ఫ్యాన్స్ కు షాకిచ్చింది. కెప్టెన్ డుప్లెసిస్(23) మినహా మిగిలిన బ్యాటర్స్ అంతా విఫలమయ్యారు. కోహ్లీ(9), మ్యాక్స్‌వెల్(0), రజత్ పాటిదార్(16), సుయాష్(2), దినేష్ కార్తీక్(6), సిల్వా(18) పేలవమైన ఆట కనబరిచారు.
దినేష్ కార్తీక్ రనౌట్ అవడంతోనే బెంగళూరు ఓటమి ఖరారైందని అభిమానులు అనుకున్నా.. అహ్మద్(17) క్రీజులో ఉండటంతో ఎక్కడో ఏదో ఆశ ఉంది. కానీ.. 16వ ఓవర్లో అశ్విన్ అతడ్ని పెవిలియన్ చేర్చి బెంగళూరు ఆశలు అడియాసలు చేశాడు. అలా 17 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది బెంగళూరు జట్టు. 18వ ఓవర్ లో మరో వికెట్ కోల్పోయి మరిన్ని కష్టాల్లో పడింది. 19 ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్లు నష్టపోయి 114 పరుగులు చేసింది. లాస్ట్ ఓవర్ కి 29 పరుగులు కావాల్సి ఉండగా.. మూడో బంతికి వికెట్ పడడంతో బెంగళూరు ఓటమి పాలైంది.