ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి టార్గెట్ ఫిక్స్ అయింది. ఈనెల 25న గ్రాండ్ గా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా నుంచి మొదటి రోజే 200 కోట్ల రూపాయలు రాబట్టాలని యూనిట్ లక్ష్యంగా పెట్టుకుంది. ఆ మేరకు గ్రౌండ్ వర్క్ కూడా పూర్తయింది.
ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు ఆర్ఆర్ఆర్ సినిమాని. తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ లో కనివినీ ఎరుగని రీతిలో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే టికెట్ రేట్లు ఫిక్స్ అయ్యాయి. గరిష్టంగా 265 రూపాయల వరకు టికెట్ రేట్ పెంచుకోవచ్చు. పైగా రిలీజ్ డేట్ నుంచి 10 రోజుల పాటు పెంచిన టికెట్ రేట్లు అమల్లో ఉంటాయి. దీంతో మొదటి రోజు ఏపీ నుంచి అటుఇటుగా 30-32 కోట్ల రూపాయల షేర్ వచ్చే అవకాశం ఉంది. గ్రాస్ రూపంలో చూసుకుంటే దీని విలువ దాదాపు 55 కోట్ల రూపాయలు.
అటు నైజాం నుంచి కూడా దాదాపు ఇంతే మొత్తంలో గ్రాస్ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఓవర్సీస్, ఉత్తరాది వసూళ్లు కూడా కలుపుకుంటే ఈ సినిమాకు తొలి రోజు 200 కోట్ల రూపాయల గ్రాస్ రావడం గ్యారెంటీ అంటున్నారు మేకర్స్. దుబాయ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి దేశాలతో పాటు.. సౌతిండియాలో కేరళ, కర్నాటక, తమిళనాడు ఉండనే ఉన్నాయి. ఇవన్నీ యాడ్ చేసుకుంటే, తొలి రోజు కచ్చితంగా అనుకున్న టార్గెట్ ను రీచ్ అవ్వబోతోంది ఆర్ఆర్ఆర్.
ఆర్ఆర్ఆర్ సినిమాకు కేవలం థియేటర్ల నుంచి వెయ్యి కోట్ల రూపాయల వసూళ్లు ఆశిస్తున్నారు. ఇలా బాహుబలి-2 సృష్టించిన రికార్డును క్రాస్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. మొదటి 3 రోజుల్లోనే 600 కోట్ల రూపాయల వసూళ్లు రావడంతో పాటు.. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే.. వెయ్యి కోట్ల టార్గెట్ అందుకోవడం ఏమంత కష్టం కాదు.