సినిమాను అద్భుతంగా తీయడమే కాదు, అంతే అద్భుతంగా దానికి ప్రచారం కల్పించడంలో కూడా రాజమౌళి దిట్ట. బాహుబలి సినిమాతోనే రాజమౌళి ప్రచారం హంగులు చూశారంతా. మరీ ముఖ్యంగా బాహుబలి-2 కోసం రాజమౌళి ఫాలో అయిన ప్రచార పోకడలు, కొత్త పద్ధతులు టాలీవుడ్ కు ఓ కొత్త గైడ్ గా మారాయి. ఇప్పుడీ దర్శకుడు ఆర్ఆర్ఆర్ ప్రచారంపై దృష్టిపెట్టాడు.
మార్చి 25న థియేటర్లలోకి రాబోతోంది ఆర్ఆర్ఆర్. దీనికి సంబంధించి వినూత్నంగా ప్రచారం చేయబోతున్నాడు రాజమౌళి. ఇప్పటికే పీవీఆర్ బ్రాండ్ తో ప్రత్యేకంగా ఒప్పందం కుదుర్చుకున్నారు రాజమౌళి. దేశవ్యాప్తంగా ఉన్న పీవీఆర్ మల్టీప్లెక్స్ చెయిన్ లో ఆర్ఆర్ఆర్ ను ప్రదర్శించడంతో పాటు.. ఏకంగా మాల్ పై పీవీఆర్ పేరును PVRRRగా మార్చేశారు.
ఇప్పుడిలాంటి మరిన్ని వినూత్నమైన ఆలోచనలతో ముందుకొస్తున్నాడు రాజమౌళి. ఈసారి మరిన్ని బ్రాండ్స్ ను తన సినిమా ప్రచారానికి వాడుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో పలు అంతర్జాతీయ బ్రాండ్స్ కూడా ఉన్నాయి.
ఇలా ఓవైపు ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తూనే, మరోవైపు హీరోలు, హీరోయిన్లతో ఇంకోసారి దేశవ్యాప్తంగా పర్యటించడానికి రూట్ మ్యాప్ సిద్ధం చేశాడు రాజమౌళి. ఇటు సంప్రదాయబద్ధంగా, అటు వినూత్నంగా ప్రచార పద్ధతులు ఉపయోగించి.. ఆర్ఆర్ఆర్ ను టాక్ ఆఫ్ ది ఇండియాగా మార్చేయడానికి రెడీ అవుతున్నాడు. బహుశా.. మార్చి 1 నుంచి దేశమంతా మరోసారి ఆర్ఆర్ఆర్ గురించే మాట్లాడుకుంటుందేమో.