ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతోంది. నార్త్ బెల్ట్ తప్ప, మిగతా అన్ని ప్రాంతాల్లో ఈ సినిమాకు ఎదురులేకుండా పోయింది. నిన్నటితో 9 రోజుల రన్ పూర్తిచేసుకున్న ఆర్ఆర్ఆర్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 200 కోట్ల రూపాయల షేర్ సాధించింది. ఇదొక రికార్డ్. ఉగాది కలిసిరావడంతో ఆర్ఆర్ఆర్ కు నిన్న మరోసారి వసూళ్లు పోటెత్తాయి.
ఇక ఓవర్సీస్ విషయానికొస్తే, అక్కడ కూడా కలెక్షన్లు భారీగా నమోదవుతున్నాయి. చూస్తుండగానే 12 మిలియన్ డాలర్లు ఆర్జించింది ఈ సినిమా. నిన్న యూఎస్ఏలో ఆర్ఆర్ఆర్ కు భారీ వసూళ్లు వచ్చాయి. ఈరోజు కూడా ఆక్యుపెన్సీ ఎక్కువగా ఉంది. సో.. సోమవారం నాటికి ఈ సినిమాకు ఓవర్సీస్ లో 15 మిలియన్ డాలర్ వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. అంటే.. ఇవాళ్టి నుంచి ఓవర్సీస్ బయ్యర్లు ఈ సినిమాతో లాభాలు కళ్లజూడబోతున్నారన్నమాట.
ప్రస్తుతం ఓవర్సీస్ లో నంబర్ వన్ పొజిషన్ లో బాహుబలి-2 సినిమా ఉంది. ఆ సినిమాకు 20 మిలియన్ డాలర్ల వసూళ్లు వచ్చాయి. ఈ సినిమాను ఆర్ఆర్ఆర్ క్రాస్ చేస్తుందా అనేది అందరి అనుమానం. ప్రస్తుతానికైతే ఆర్ఆర్ఆర్ సినిమాకు ఈ వీకెండ్ కాకుండా, మరో వీకెండ్ టైమ్ మాత్రమే ఉంది. ఆ తర్వాత ఈ సినిమాపై అంత బజ్ ఉండకపోవచ్చు.
రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఈ సినిమాలో అలియాభట్, అజయ్ దేవగన్ కీలక పాత్రలు పోషించారు. సినిమాలో పెద్దగా ప్రాధాన్యం లేని పాత్రలు పోషించారనే కోపంతో, నార్త్ ఆడియన్స్ ఈ సినిమాను తిరస్కరించారు. అటు అలియా, దేవగన్ పై ట్రోలింగ్ కూడా నడుస్తోంది.