మరికొన్ని గంటల్లో గ్రాండ్ గా థియేటర్లలోకి రాబోతోంది ఆర్ఆర్ఆర్ సినిమా. ఈ సినిమా కోసం తెలుగు రాష్ట్రాల్లో ఇటు మెగాభిమానులు, అటు నందమూరి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి-2 లాంటి చరిత్ర తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి డైరక్ట్ చేసిన సినిమా కావడం, టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ కావడంతో ఆర్ఆర్ఆర్ పై అంచనాలు ఆకాశాన్నంటాయి.
రేపు హైదరాబాద్ లోని దాదాపు 90శాతం థియేటర్లలో ఆర్ఆర్ఆర్ సినిమానే ప్రదర్శిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి. పైగా తెలంగాణలో 5 షోలకు అనుమతులు ఇవ్వడంతో రేపు ఉదయం 6 గంటల నుంచే సినిమా ప్రసారాలు మొదలుకాబోతున్నాయి.
ఇక హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో రేపు ఉదయం 4 గంటలకే ఆర్ఆర్ఆర్ షోలు పడబోతున్నాయి. ఈ స్పెషల్ ప్రీమియర్ షోలను ఈరోజు అర్థరాత్రి నుంచి ప్రారంభించాలని అనుకున్నారు కానీ, అనుమతులు రాకపోవడంతో రేపు ఉదయం 4.30 నుంచి మొదలు పెడుతున్నారు. దీంతో అటు ఓవర్సీస్ లో, ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ షోలు ఒకేసారి మొదలుకాబోతున్నాయి. సో.. ఓవర్సీస్ టాక్ కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదన్నమాట.
ఇదిలా ఉండగా.. ఈరోజు రాత్రికి టాలీవుడ్ లో కొందరు ప్రముఖులకు ఈ సినిమాను ప్రత్యేకంగా చూపించబోతున్నారు. ఆ ప్రముఖులు ఎవరనేది ఇంకా క్లారిటీ రాలేదు. అటు మీడియాకు కూడా సమాచారం అందించలేదు. ఆర్ఆర్ఆర్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 200 కోట్ల రూపాయల వసూళ్లు అంచనా వేస్తున్నారు.
తాజా ట్రెండ్స్ ప్రకారం చూసుకుంటే.. ఇదేమంత కష్టం కాదనిపిస్తోంది. అయితే నార్త్ బెల్ట్ లో మాత్రం ఆర్ఆర్ఆర్ కు ఆశించిన స్థాయిలో బుకింగ్స్ జరగడం లేదు. సినిమాకు హిట్ టాక్ వచ్చిన తర్వాత అక్కడ ఆక్యుపెన్సీ పెరిగే అవకాశం ఉంది.