దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ఆర్ఆర్ఆర్. మార్చి 25న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు కలెక్షన్లను షేక్ చేసింది. దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. ప్రపంచ వ్యాప్తంగా రూ.1100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి రికార్డుని సృష్టించింది. అయితే, ఆర్ఆర్ఆర్ సినిమా టిక్కెట్ల ధరల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి షాక్ తగిలింది.
ఆర్ఆర్ఆర్ సినిమా టిక్కెట్ల ధరలు పెంచుకునేందుకు జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ తుప్పతి శ్రీనివాస్ అనే వ్యక్తి లోకాయుక్తలో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌కు శనివారం నోటీసులు జారీ చేసింది. జూలై 22న లోకాయుక్త కోర్టుకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది.
తెలంగాణలో ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల సందర్భంగా, సినీ నటుల విజ్ఞప్తి మేరకు టిక్కెట్ల ధర పెంచుకోవచ్చునని ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే, ఇది సామాన్య సినీ అభిమానులకు ఆర్థిక భారంగా మారుతోందని పేర్కొంటూ.. ప్రభుత్వం జారీ చేసిన జీవోకు వ్యతిరేకంగా సామాజిక సేవా కార్యకర్త, తీన్మార్ మల్లన్న టీం జనగాం జిల్లా కో కన్వీనర్ తుప్పతి శ్రీనివాస్ హైదరాబాద్‌లోని లోకాయుక్త కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ పరిశీలించిన కోర్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు నోటీసులు జారీ చేసింది. జూలై నెల 22వ తేదీన ఉదయం 11 గంటలకు కోర్టుకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. అయితే, కొంత మంది ప్రైవేట్ వ్యక్తుల విజ్ఞప్తి మేరకు సినిమా టిక్కెట్ల ధర పెంపు జీవో ఎలా జారీ చేస్తారని తుప్పతి శ్రీనివాస్ పిటిషన్‌లో ప్రశ్నించారు. ఈ జీవో జారీ చేసి సామాన్యుల వద్ద 100ల కోట్ల రూపాయలు కొల్లగొట్టారని, దీని వెనక కొంత మంది ప్రభుత్వ పెద్దలు, రాజకీయ నాయకుల హస్తం ఉందని, ఈ విషయంపై న్యాయం చేయాలని లోకాయుక్త కోర్టు వారిని కోరినట్లు తుప్పతి శ్రీనివాస్ వెల్లడించారు.