ఆస్కార్-2023 వేదికపై ఆర్ఆర్ఆర్ టీమ్ వండర్ చేసింది. ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు యావత్ ప్రపంచం ఫిదా అయింది. ఈ వేదికపై ఈ సాంగ్ కి ఎదురేలేకపోయింది. తెలుగు పండగ అక్కడ నూతనోత్సాహాన్ని నింపింది. అంతా బాగానే ఉంది. కానీ ఇంత సంరంభంలోనూ ఎక్కడో ఓ చేదు గుళిక ! డాల్బీ థియేటర్స్ లోని ఈ వేదిక వద్ద జరిగిన సీటింగ్ ఏర్పాట్లపై జక్కన్న, ఆయన టీమ్ ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
రాజమౌళి, రామ్ చరణ్, జూనియర్ ఎన్ఠీఆర్, కీరవాణి, చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ తదితరులు అందరికన్నా చివరి సీట్లలో.. ఎగ్జిట్ ద్వారం వద్ద కూర్చున్న వీడియో వైరల్ కాగా.. ఇది చూసిన అభిమానులంతా తీవ్ర నిరాశను, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇది చాలా సిగ్గు చేటంటూ వారు అకాడెమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ని దుయ్యబట్టారు.
దేశ విదేశాల్లో అత్యంత పాపులారిటీ సంపాదించుకున్న ఈ టీమ్ ని చివరి వరుసలో.. అది కూడా నిష్క్రమణ ద్వారానికి సమీపంలో కూర్చోబెడతారా అని అనేకమంది నెటిజనులు సైతం ఫైరయ్యారు. ‘ఇట్ ఈజ్ షేమ్ ది ఆర్ఆర్ఆర్ టీమ్ వర్ ప్లేస్డ్ ఎట్ ది బ్యాక్ ఆఫ్ ది ఆడిటోరియం’ అని ఒకరంటే..’ఈ టీమ్ ని అందరికన్నా వెనుక ఎందుకు కూర్చోబెట్టారని’ మరొకరు ప్రశ్నించారు.
ఎగ్జిట్ ద్వారం వద్ద వారికి సీట్లు కేటాయించడం చాలా దయనీయంగా ఉందని ఇంకొకరు వ్యాఖ్యానించారు. ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి ఆస్కార్ అవార్డు వస్తుందని తెలిసినా.. ఇలా చేయడమేమిటని ఆ నెటిజన్ కూడా ఆగ్రహంగా స్పందించారు. మరి దీనిపై అకాడెమీ ఆఫ్ మోషన్ పిక్చర్ వారు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.