మరో ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైంది ఆర్ఆర్ఆర్. అయితే.. ఈసారి ఈ పోటీ మరింత రసవత్తరంగా మారబోతోంది. ఈ సినిమాకు సంబంధించి ఉత్తమ నటుడు ఎవరనేది ఆ అవార్డుల్లో ప్రధానమైన చర్చ. ఎన్టీఆర్ ను ఉత్తమ నటుడి అవార్డ్ వరిస్తుందా? లేక రామ్ చరణ్ బెస్ట్ యాక్టర్ అనిపించుకుంటాడా? అనేది తేలాల్సి ఉంది.
ఉత్తమ నటుడి అవార్డు కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ పోటీ పడుతున్నారు. వీరిద్దరు క్రిటిక్స్ ఛాయిస్ సూపర్ అవార్డులకు నామినేట్ అయ్యారు. రెగ్యులర్ కమర్షియల్, సూపర్ హీరో చిత్రాలకు ఈ అవార్డులు ఇస్తారు.
టామ్ క్రూజ్(టాప్ గన్: మావెరిక్), నికోలస్ కేజ్ (ది అన్‌బేరబుల్ వెయిట్ ఆఫ్ మాసివ్ టాలెంట్)తో పాటు మన టాలీవుడ్ స్టార్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఈ అవార్డులకు నామినేట్ అవ్వడం విశేషం. అయితే.. ఒకే సినిమాతో ఇద్దరు హీరోలు పోటీ పడడం ఇదే తొలిసారి.
‘ఆర్ఆర్ఆర్’ అమెరికాలో సంచలనం రేపుతోంది. “నాటు నాటు” పాట ఇప్పటికే ఆస్కార్స్ లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా నామినేట్ అయింది. ప్రస్తుతం రామ్ చరణ్ అమెరికాలో ఉన్నాడు. సూపర్ హిట్ ‘గుడ్ మార్నింగ్ అమెరికా’ టీవీ కార్యక్రమానికి హాజరై చరిత్ర సృష్టించాడు.