ఒక అగ్ర హీరో నటించిన సినిమా రిలీజ్ అయితే.. అభిమానుల్లో మామూలు ఉత్సాహం ఉండదు. అలాంటిది ఒకే సినిమాలో ఇద్దరు అగ్ర హీరోలు ఉంటే.. వారిద్దరిని ఎవరికి ఎవరూ తీసిపోకుండా చూపిస్తే.. రెండు వర్గాలకు చెందిన అభిమానుల్లో ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. అలాంటి సినిమాల జాభితాలో చేరింది ఆర్ఆర్ఆర్. ఇప్పుడు ఈ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. భారీ వసూళ్లతో దూసుకుపోతోంది.
ఓ సినిమా ఒక థియేటర్ లో కోటి రూపాయల గ్రాస్ వసూల్ చేయడం సింపుల్ అయింది ఇటీవల కాలంలో. కానీ.. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో మెయిన్ థియేటర్.. ఏఎంబీ సినిమాస్ లాంటి చోట్ల కోటి రూపాయల గ్రాస్ కేక్ వాక్ అయిపోయింది. అయితే.. ఒక థియేటర్లో ఒక సినిమా రూ.2 కోట్ల వసూళ్లు రాబట్టే రోజులు కూడా వచ్చేసినట్లే కనిపిస్తోందంటున్నారు కొందరు సినీ ప్రముఖులు. అయితే.. తెలుగు ఇండస్ట్రీలో ఆ ఘనతను ఆర్ఆర్ఆర్ సినిమా సాధించబోతోందనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ 35 ఎంఎంలో రూ.2 కోట్ల గ్రాస్ కు చేరువగా దూసుకుపోతోంది ఆర్ఆర్ఆర్ సినిమా. మొత్తంగా ఒక్క క్రాస్ రోడ్స్‌లోనే ఈ సినిమా రూ.4 కోట్ల గ్రాస్ మార్కుకు చేరుకోవడం గమనార్హం. ఫుల్ రన్లో ఈ ఒక్క ఏరియా నుంచి రూ.5 కోట్లకు గ్రాస్ కలెక్ట్ చేయడం లాంఛనంగానే కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. ఒక సినిమా ఒక సిటీలోని ఒక చిన్న ఏరియాలో 5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం అన్నది సామాన్యమైన విషయం కాదంటున్నారు.
తొలి వీకెండ్లో ఇంకా ఎక్కువ థియేటర్లలో సినిమాను నడిపించారు. అన్ని థియేటర్లూ హౌస్ ఫుల్స్‌తో నడిచాయి. రెండో వీకెండ్లోనూ ఇక్కడ ఆర్ఆర్ఆర్ ఆడుస్తున్న అన్ని థియేటర్లలో.. హౌస్ ఫుల్స్ ఖాయంగా కనిపిస్తోందంటున్నారు. వీక్ డేస్ లో కొంత తగ్గిన ఆక్యుపెన్సీ వీకెండ్ కు వచ్చేసరికి పుంజుకున్నట్లే కనిపిస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి.