నాటు నాటా? ఇదేం పాట.. చంద్రబోస్ రాతల్లో విషయం అయిపోయిందా? బాహుబలి తీసిన రాజమౌళి ఇలాంటి పాటను ఎలా చేశాడు..? నాటు సాంగ్ రిలీజ్ అయినప్పుడు వచ్చిన విమర్శలివి. ఇక సోషల్ మీడియాలో సంగతి సరేసరి. ఎవరి మీద కోపమో.. వైరల్ అవ్వాలన్న ఉద్దేశమో గానీ.. నెగెటివ్ ప్రచారం విస్తృతంగా చేశారు. వాళ్లకేం తెలుసు.. స్వరపరిచేందుకు కీరవాణి పడిన స్ట్రగుల్. రాసేందుకు చంద్రబోస్ కు ఎదురైన సవాల్. రాజమౌళి కష్టాన్ని రామ్ చరణ్, ఎన్టీఆర్ శ్రమను తేలిగ్గా తీసిపడేశారు. కానీ, ఇప్పుడేమైంది?
విమర్శకులకు కర్రు కాల్చి వాత పెట్టేలా.. అంతర్జాతీయ వేదికపై తెలుగు పాట సత్తా చాటింది. 95వ ఆస్కార్ వేడుకల్లో అవార్డు గెలుచుకుంది. ఆరేళ్ల పిల్లాడి నుంచి అరవై ఏళ్ల ముసలోళ్ల దాకా అందరికీ నాటు కొట్టుడు రుచి చూపించింది ఆర్ఆర్ఆర్ టీమ్. సినిమా రిలీజయ్యే సమయానికే ఈ పాట ఒక సంచలనంగా మారింది. హాలీవుడ్ ప్రేక్షకుల చేత ఈటలు, డ్యాన్సులు వేయించింది ఈ సాంగ్.
చంద్రబోస్ కు ఈ పాట పూర్తి చేయడానికి దాదాపు 19నెలలు పట్టింది. ఒక పాట కోసం ఆయన ఇంత సమయం తీసుకోవడం ఇదే తొలిసారి.కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ దాదాపు 95 స్టెప్పులు కంపోజ్ చేశాడు. తారక్, చరణ్ భుజాలపై చేతులేసుకుని వేసిన హూక్ స్టెప్ కోసం ఏకంగా 30 వెర్షన్ లు రెడీ చేశాడు. ఈ సాంగ్ కోసం రాజమౌళి 19 టేకులు తీసుకున్నాడు. కానీ, చివరికి రెండో టేకునే ఓకే చేశాడు. ఇలా ఒక్క పాట కోసం ఆర్‌ఆర్‌ఆర్ బృందం చిన్నపాటి యుద్ధమే చేసింది.
నిజానికి ‘‘నాటు నాటు’’ పాట ఇంత పెద్ద హిట్ కావడానికి కేవలం డ్యాన్స్, మ్యూజిక్ కారణం కాదు. అందులో అందమైన స్టోరీ ఉంది. భారతీయుడిని చిన్నచూపు చూడడం.. మన సంస్కృతితోనే వారికి బుద్ధి చెప్పడం లాంటి మెసేజ్ ను చూపించారు. అంతేకాదు, మొత్తం ఆర్ఆర్ఆర్ స్టోరీ అంతా సాంగ్ సాగిన పది నిమిషాల్లోనే ఉంది.
ఈ పాట విజయంలో విజువలైజేషన్స్ కూడా ప్రధాన భూమిక పోషించింది. తొలుత ఈ పాటను ఇండియాలోనే చిత్రీకరిద్దామని అనుకున్నారు. అయితే.. వర్షాకాలం ప్రారంభం కావడంతో ఇతర లొకేషన్ల గురించి ఆలోచించి.. చివరకు ఉక్రెయిన్ రాజధాని కీవ్ లోని ప్రెసిడెన్సియల్ ప్యాలస్ ను ఎంచుకున్నారు. ఈ ప్రదేశమే ‘‘నాటు నాటు’’ పాటకు బెస్ట్ అని అనుకున్నారు. ప్యాలస్ కలర్, సైజ్, గ్రౌండ్ అన్నీ పాటకు సరిగ్గా సరిపోయాయని భావించి తెరకెక్కించారు. ఈ సాంగ్ చిత్రీకరణ తర్వాత కొద్ది రోజులకు ఉక్రెయిన్, రష్యా వార్ ప్రారంభం అయింది.
అయితే.. ఇండియన్ ఫిల్మ్ ఫెడరేషన్ ఆర్ఆర్ఆర్ ను ఆస్కార్ కి సెలెక్ట్ చేయలేదు. కానీ, రాజమౌళి ప్రైవేట్ పద్ధతుల్లో వెళ్లి ఆస్కార్ కి నామినేట్ అయ్యేలా చేశారు. చాలా రోజులుగా అక్కడి మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ, ఆ పాట గొప్పతనాన్ని వివరించారు. ఆర్‌ఆర్‌ఆర్ గురించి ప్రత్యేకంగా వెల్లడించారు. అంతేకాదు, అమెరికన్లకి రీచ్ అయ్యేలా అక్కడి మీడియాలో ఆర్‌ఆర్‌ఆర్, నాటు నాటుపై చర్చ జరిగేలా కేర్ తీసుకున్నారు. ఎన్టీఆర్, రాంచరణ్ సైతం దీన్ని ప్రమోట్ చేశారు. అలా ఎన్నో అవాంతరాలు దాటుకుని చివరకు ఆస్కార్ సాధించింది ఈ సాంగ్. ఈ క్రెడిట్ ఏ ఒక్కరిదో కాదు. సమిష్టి కృషితో సాధించింది.