ఎప్పుడైతే సంక్రాంతి బరి నుంచి తప్పుకుందో, అప్పుడిక ఆర్ఆర్ఆర్ ప్రచారాన్ని ఆపేశారు. ఆ తర్వాత కొత్తగా మార్చి 25 అంటూ రిలీజ్ డేట్ ప్రకటించినప్పటికీ, ప్రచారంపై ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. కట్ చేస్తే, ఇప్పుడు విడుదలకు నెల రోజులు మాత్రమే సమయం ఉంది. మరి ఆర్ఆర్ఆర్ ఎలాంటి ప్లాన్ లో ఉంది? ఈ నెల రోజుల్లో సినిమాకు ఎలా ప్రచారం కల్పించబోతున్నారు?
ఈ విషయంలో రాజమౌళి భారీ స్కెచ్ తో రెడీ అయినట్టు తెలుస్తోంది. మరోసారి హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్, హీరోయిన్ అలియాభట్ తో చర్చించి వాళ్ల డేట్స్ తీసుకున్నాడు. ఈసారి ఎక్కడ, ఎలా ప్రచారం చేయాలో పక్కాగా చార్ట్ రెడీ చేసుకున్నారు. కిందటి సారి జరిగినట్టు ఎలాంటి అపశృతులు దొర్లకుండా పక్కాగా అన్నీ సెట్ చేసుకున్నారు. అంతేకాదు.. ఎప్పట్నుంచి ప్రచారం ప్రారంభించాలనే అంశంపై ఓ తేదీ కూడా అనుకున్నారు.
నిజానికి ఈపాటికే ఆర్ఆర్ఆర్ ప్రచారం మొదలుపెట్టాల్సింది. కానీ భీమ్లానాయక్ హంగామా నడుస్తున్న వేళ.. ఆర్ఆర్ఆర్ ప్రచారం చేయడం కరెక్ట్ కాదని భావించి కాస్త తగ్గారు. మరో 2 రోజుల్లో భీమ్లానాయక్ థియేటర్లలోకి వచ్చేస్తుంది. ఆ వెంటనే ఆర్ఆర్ఆర్ ప్రచారం గట్టిగా మొదలుకాబోతోంది. ఈ మేరకు మరికొన్ని ప్రోమోలు కూడా సిద్ధం చేశాడు రాజమౌళి. దశలవారీగా ఆ ప్రోమోల్ని విడుదల చేయబోతున్నాడు.
ప్రచారం కోసం ఇప్పటికే పీవీఆర్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న జక్కన్న.. మరిన్ని బ్రాండ్స్ ను రంగంలోకి దించబోతున్నాడు. సినిమా రిలీజ్ అయ్యే సమయానికి దాదాపు అన్ని ప్రముఖ కార్పొరేట్ బ్రాండ్లు, ఆర్ఆర్ఆర్ ను రిప్రజెంట్ చేయబోతున్నాయి. ఈ మేరకు కొన్ని సంస్థలతో ఒప్పందాలు పూర్తయ్యాయి. మరికొన్ని కార్పొరేట్ సంస్థలన్నీ ఆర్ఆర్ఆర్ బ్రాండింగ్ తో యాడ్స్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాయి. ఇలా తెరవెనక భారీ స్కెచ్ తో రెడీ అయ్యాడు రాజమౌళి.