రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రభంజనం కొనసాగుతోంది. ప్రస్తుతం జపాన్ లో ఈ సినిమా హంగామా నడుస్తోంది. ఆ దేశంలో ఆర్ఆర్ఆర్ మూవీ బంపర్ హిట్టయింది. భారీ వసూళ్లు సాధించిన రెండో ఇండియన్ మూవీగా నిలిచింది.
జపాన్ లో ఆర్ఆర్ఆర్ విడుదలై నెల రోజులు దాటింది. ఈ సినిమా ప్రచారం కోసం చరణ్, తారక్, జక్కన్న ప్రత్యేకంగా టోక్యో వెళ్లారు. ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. వీళ్ల ప్రచారం ఫలించింది. రిలీజైన ఈ 34 రోజుల్లో ఈ సినిమాకు జపాన్ లో 305 మిలియన్ యన్స్ వసూళ్లు వచ్చాయి. ఇండియన్ కరెన్సీలో దీని విలువ దాదాపు 18 కోట్ల రూపాయలు.
జపాన్ లో భారీ విజయం సాధించిన తెలుగు సినిమా ముత్తు మాత్రమే. 2 దశాబ్దాల కిందట రిలీజైన ఆ సినిమా ఇప్పటికీ అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాగా కొనసాగుతోంది. అప్పట్లోనే ఆ సినిమాకు దాదాపు 25 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఆ తర్వాత స్థానంలో ఇప్పుడు ఆర్ఆర్ఆర్ నిలిచింది.
జపాన్ వసూళ్లతో ఆర్ఆర్ఆర్ మరికొన్ని రికార్డులు కూడా సాధించింది. వరల్డ్ వైడ్ వసూళ్లలో 300 మిలియన్ డాలర్ల క్లబ్ లోకి ఈ సినిమా చేరింది. ఈ క్రమంలో బాహుబలి-2 సృష్టించిన రికార్డుల్ని కూడా అధిగమించింది.