రాజమౌళి సినిమా అంటే ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉంటాయి. అందుకు కారణం ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. అందులోనూ ‘బాహుబలి’ మూవీతో ప్రపంచం మొత్తాన్ని టాలీవుడ్ వైపు చూసేలా చేశారు. ఇక ఆ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మరో సినిమా ఆర్ఆర్ఆర్ కూడా భారీ అంచనాలతో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. బిగ్ మల్టీస్టారర్‌గా రూపొందిన ఈ సినిమాలో స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించడంతో దీని రేంజ్ మరింతగా పెరిగింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుందంటూ జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ సీక్వెల్‌పై రచయిత విజయేంద్ర ప్రసాద్ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో తనకెదురైన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ”ఓ రోజు ఎన్టీఆర్ మా ఇంటికి వచ్చాడు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ కొనసాగింపు చిత్రం గురించి అడిగాడు. నేను కొన్ని ఐడియాలు చెప్పా. తనకు, రాజమౌళికి బాగా నచ్చాయి. దైవానుగ్రహం ఉంటే సీక్వెల్ వస్తుంది” అని తెలిపారు.
ఈ క్రమంలో అన్ని కుదిరితే ఆర్ఆర్ఆర్ కూడా సీక్వెల్ రాబోతుందని అర్థమవుతుంది. దీంతో సినీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ యాక్షన్ డ్రామాలో రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా ఆకట్టుకున్నారు. అలియా భట్, ఒలివియా మోరిస్, అజయ్ దేవ్‌గణ్, శ్రియ, సముద్రఖని, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఇక ఈ సినిమా విడుదలై ఏడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.710 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డు సృష్టించింది. ఎంతో కీలకమైన హిందీ మార్కెట్లో కూడా సాలిడ్ వసూళ్లును అందుకుంది.
కాగా, రాజమౌళి మాత్రం ఆర్ఆర్ఆర్ తర్వాత మహేష్ బాబుతో సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా మరో రెండు మూడు సంవత్సరాలు ఆర్ఆర్ఆర్ సీక్వెల్ కోసం డేట్స్ ఇవ్వడం చాలా కష్టం.. మరి చివరికి ఏం జరుగుతుందో వేచి చూడాలి.