మరో చరిత్ర సృష్టించే దిశగా దూసుకుపోతోంది ఆర్ఆర్ఆర్ సినిమా. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 90 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించిన ఈ సినిమా, ఈ వీకెండ్ పూర్తయ్యేసరికి 100 మిలియన్ డాలర్ల క్లబ్ లోకి వెళ్లబోతోంది. ఇన్నాళ్లూ ఇండియన్ సినిమా విభాగంలో మాత్రమే పోటీనిచ్చిన ఈ సినిమా.. ఇప్పుడు హాలీవుడ్ సినిమాలతో పోటీపడే స్థాయికి ఎదిగింది.
స్పైడర్ మేన్ హోమ్ కమింగ్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 800 మిలియన్ డాలర్ల వసూళ్లు వచ్చాయి. ఎందుకంటే ఈ సినిమాను తప్పనిసరిగా థియేటర్లలో మాత్రమే చూడాలని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. ఆర్ఆర్ఆర్ విషయంలో కూడా ప్రేక్షకులు అలానే ఫీల్ అవ్వడంతో, వసూళ్లు భారీగా వస్తున్నాయి. భారతీయ ప్రేక్షకులతో పాటు హాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఈ సినిమాను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
రీసెంట్ గా ఆస్కార్ అవార్డు అందుకున్న డూన్ కు 108 మిలియన్ డాలర్ల వసూళ్లు వచ్చాయి. మరికొన్ని రోజుల్లో ఈ రికార్డును ఆర్ఆర్ఆర్ అధిగమించబోతోంది. ఇలా ఓ భారతీయ చిత్రం హాలీవుడ్ తో పోటీపడడం ఇదే తొలిసారి. బాహుబలి-2 టైమ్ లో కూడా ఇలా జరగలేదు.
ఆర్ఆర్ఆర్ సినిమాకు ఈ వీకెండ్ కీలకం కాబోతోంది. రికార్డుల పరంగానే కాకుండా.. బ్రేక్ ఈవెన్ పరంగా ఈ సినిమా గట్టెక్కాలంటే ఈ వీకెండ్ గట్టిగా ఆడాలి. ఇంకా చెప్పాలంటే.. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మరో 50 కోట్ల రూపాయలు రావాలి. అటు ఓవర్సీస్ లో ఈ సినిమా 15 మిలియన్ డాలర్ల క్లబ్ లోకి ఎంటరవ్వాలి. ఆ తర్వాతే ఇతర రికార్డుల గురించి ఆలోచించాలి.