– ట్రిపుల్ ఆర్ కు అదనంగా ఇంకో ఆర్
– రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ
– సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్
రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీలోకి వెళ్తున్నారు కాబట్టే రాజీనామా చేశారనే చర్చ సాగుతుండగా.. కాంగ్రెస్ నేత మల్లు రవి కీలక వ్యాఖ్యలు చేశారు. మూడేళ్లుగా రాజగోపాల్ కాంగ్రెస్ లో బీజేపీకి కోవర్టుగా పని చేశారని విమర్శించారు. ఈ పంచాయితీ అటుంచితే.. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికపై ప్రధాన పార్టీలన్నీ దృష్టి పెట్టాయి. కాంగ్రెస్ పార్టీ త్వరలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. అటు అభ్యర్థి విషయంలో కేసీఆర్ సర్వేలలో బిజీగా ఉన్నారని చర్చ నడుస్తోంది. ఇక బీజేపీ రాజగోపాల్ రెడ్డి బరిలోకి దింపి గెలిపించి.. వచ్చే ఎన్నికలకు ఇది ట్రైలర్ అన్నట్టుగా చూపించాలని ప్రయత్నాల్లో ఉంది.
గత ఎన్నికల్లో బీజేపీ తరఫున ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలిచారు. ఆయన రాజాసింగ్. ఆ తర్వాత పార్టీ పగ్గాలు బండి సంజయ్ చేపట్టడం.. బీజేపీ బలం పుంజుకోవడం చకచకా జరిగిపోయాయి. అనంతరం వచ్చిన దుబ్బాక ఉప ఎన్నికలో రఘునందన్ రావు గెలిచారు. ఇక హుజూరాబాద్ ఉప ఎన్నికలోనూ బీజేపీ తరఫున నిలబడ్డ రాజేందర్ విజయం సాధించారు. ఈటల గెలుపు సమయంలో ట్రిపుల్ ఆర్ అనే పదం గట్టిగా వినిపించింది. తమ ముగ్గురు ఎమ్మెల్యేలు కేసీఆర్ ను ఆడుకుంటారని బాగా ప్రమోట్ చేశారు బండి సంజయ్. ఇప్పుడు మునుగోడుకు ఉప ఎన్నిక ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే నాలుగో ఆర్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
రాజగోపాల్ రెడ్డి బీజేపీ తరఫున నిలబడి గెలవడం ఖాయమని ధీమాగా ఉన్నారు ఆ పార్టీ శ్రేణులు. బీజేపీలో చేరే విషయంపై రాజగోపాల్ బహిరంగంగా ప్రకటించకపోయినా.. కమలనాథులు మాత్రం ధీమాగా ఉన్నారు. ఆయన తమ పార్టీలోకే వస్తున్నారని ముందస్తుగా ప్రకటనలు కూడా చేసేశారు. దీన్ని బట్టి నాలుగో ఆర్ పోటీకి దిగుతున్నట్లు అర్థం అవుతోంది. అయితే.. మునుగోడులో కాంగ్రెస్ కు బలమైన క్యాడర్ ఉంది. అందుకే హస్తం నేతలు రాజగోపాల్ వెళ్లినా.. ధీటుగా కౌంటర్లు ఇస్తున్నారు. అలా అని.. రాజగోపాల్ ను తేలిగ్గా తీసుకోవడానికి లేదు. ఈ మూడేళ్లలో నియోజకవర్గంపై పట్టు సాధించారు.
కాంగ్రెస్ పై తిరుగుబావుటా ఎగురవేసిన రాజగోపాల్ పై నియోజకవర్గంలో పెద్దగా వ్యతిరేకత రాకపోవడానికి నిదర్శనం ఆయనకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన కార్యక్రమాలే. శవయాత్ర, దిష్టిబొమ్మ దహనాలు అంటూ కాంగ్రెస్ శ్రేణులు హడావుడి చేస్తున్నా.. మునుగోడులో మాత్రం పెద్ద లీడర్లు ఎవరూ పాల్గొనడం లేదు. కొంతమంది కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులు మాత్రమే నిరసనలు కొనసాగిస్తున్నారు. దీన్నిబట్టి రాజగోపాల్ నియోజకవర్గంలో ఎంతటి పట్టు సాధించారో అర్థం అవుతోందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. అందుకే అమిత్ షా.. రాజీనామా చేసి గెలవాలనే కండిషన్ పెట్టారని విశ్లేషణ చేస్తున్నారు. మొత్తానికి ట్రిపుల్ ఆర్ పోయి.. ఇప్పుడు నాలుగు ఆర్ ల ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.