ఎయిరిండియా విమానానికి జరిమానాల బెడద తప్పడం లేదు. తాజాగా ఈ ఎయిర్ లైన్స్ సంస్థకు డీజీసీఏ.. రూ. 10 లక్షల పెనాల్టీ విధించింది. గత ఏడాది డిసెంబరు 6 న ప్యారిస్-ఢిల్లీ విమానంలోని టాయిలెట్ లో మద్యం తాగిన మత్తులో ఓ వ్యక్తి సిగరెట్ తాగిన ఉదంతాన్ని డీజీసీఏ సీరియస్ గా పరిగణించింది. విమాన సిబ్బంది వారిస్తున్నా వినకుండా ఆ వ్యక్తి అలాగే వ్యవహరించాడని ఈ సంస్థకు తెలిసింది.
అయితే ఈ విషయాన్ని విమాన సిబ్బంది వెంటనే తెలియజేయకుండా నిర్లక్ష్యం వహించిందని, అంతర్గత కమిటీకి తెలపడంలో జాప్యం చేసిందని తేలడంతో ఈ జరిమానా విధించారు. ఇక మరో ఘటనలో ఖాళీగా ఉన్న ఓ మహిళా ప్రయాణికురాలి సీటుపైన, ఆమెకు చెందిన బ్లాంకెట్ పైన ఓ వ్యక్తి మూత్రం పోశాడు.
ఇలాంటి ఘటనలు జరుగుతున్నా మీరెందుకు చర్య తీసుకోవడం లేదంటూ ఎయిరిండియా మేనేజర్ కి డీజీసీఏ షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీనికి నిన్న ఎయిరిండియా ఇచ్చిన సంజాయిషీని పరిశీలించిన సంస్థ..ఈ చర్య తీసుకుంది. సిబ్బంది నిర్లక్ష్యం సంబంధిత నిబంధనలను అతిక్రమించేదిగా ఉందని పేర్కొంది.
గత ఏడాది నవంబరు 26 న న్యూయార్క్-ఢిల్లీ విమానంలో ఓ వ్యక్తి మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన ఘటన నేపథ్యంలో ఎయిరిండియాపై గతవారం మూడు చర్యలు తీసుకున్నారు ఈ సంస్థపై 30 లక్షలు, ఇన్-ఫ్లైట్ సర్వీసెస్ డైరెక్టర్ కు 3 లక్షలు జరిమానా విధించడమే గాక.. సంబంధిత పైలట్ ఇన్-కమాండ్ లైసెన్స్ ని మూడు నెలలపాటు సస్పెండ్ చేశారు.