మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని పేద మహిళలకు ప్రతి నెలా రూ.1000లను ఇవ్వనున్నట్టు ఆయన ప్రకటించారు. ఇతర పథకాలు పొందుతున్న వారు కూడా దీనికి అర్హులేనని ఆయన వెల్లడించారు. దీని కోసం రాబోయే ఐదేండ్లలో తమ ప్రభుత్వం రూ.60,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.
నర్మదాపురంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… ఈ పథకంలో భాగంగా పేద మహిళలకు నెలకు వెయ్యి రూపాయలను అందిస్తామన్నారు. లాడ్లీ బహనా యోజన రాష్ట్ర మహిళల జీవితాలను మెరుగు పరుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆర్థికంగా మహిళలను బలోపేతం చేసేందుకే ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు సీఎం వెల్లడించారు.
ఇంట్లో మహిళలు ఆర్థికంగా బలంగా ఉంటే కుటుంబం బలంగా ఉంటుందని తెలిపారు. కుటుంబం బలంగా ఉంటే సమాజం కూడా బలంగా ఉంటుందన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో కోటి మంది మహిళలు లబ్ది పొందుతారని ఆయన పేర్కొన్నారు.
2018లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు రక్షా బంధన్ నేపథ్యంలో రాష్ట్రంలోని మహిళలకు సీఎం లేఖలు పంపారు. మహిళ సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోందో ఈ లేఖల్లో ఆయన వివరించారు. రాష్ట్రాన్ని సురక్షితంగా, సుసంపన్నంగా మార్చేందుకు తనను గెలిపించాలని లేఖలో ఆయన కోరారు.